పైలాన్ ఆవిష్కరించిన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌బిన్నీ, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రోత్సాహంతోనే ఏపీ ఆటగాళ్లు రాణించి.. జాతీయ స్థాయిలో అవకాశాలు పొందుతున్నారని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. ఏసీఏ 70 వసంతాల వేడుకలు సోమవారం విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియంలోని ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆవిష్కరించారు. అనంతరం రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఏపీలో క్రికెటర్లకు అవసరమైన మౌలిక వసతులు, గ్రౌండ్లు, అకాడమీలు పెరుగుతున్నాయి.
మరో పదేళ్లలో ఢిల్లీ, ముంబైతో పోటీపడే స్థాయికి రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి చెందుతోంది. తొలిసారిగా 1975లో రంజీ మ్యాచ్ ఆడేందుకు విశాఖ వచ్చాను. ఇప్పుడు విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందింది. ఏపీలో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లోనూ క్రీడలకు తగిన మౌలిక వసతులు కల్పించి.. క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరముంది. అప్పుడే భారత్‌లో క్రీడాభివృద్ధి సాధ్యపడుతుంది. బీసీసీఐ తరఫున స్కూల్ స్థాయి నుంచే ప్రొఫెషనల్ క్రికెటర్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ప్రక్రియ ఐదు రాష్ట్రాల్లో ముందంజలో ఉండగా.. ఇప్పుడు ఆంధ్ర చేరింది’ అని అన్నారు.
ఐపీఎల్‌తో అద్భుత అవకాశాలు..
క్రికెట్ ఆడే దేశాల్లో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్స్ అన్నింటిలో.. ఐపీఎల్‌కున్న క్రేజ్ ప్రత్యేకమైనదని రోజర్ బిన్నీ చెప్పారు. ఆ స్టాండర్డ్స్‌ను కాపాడాలంటే.. ఐపీఎల్‌లో పాల్గొనే ప్రాంచైజీల నియంత్రణ చాలా అవసరమన్నారు. అందుకే ఐపీఎల్‌లో మరో కొత్త ఫ్రాంచైజీకి అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు.
ఆ రోజుల్లో మూడు దశల్లో రాణించిన వారికి జాతీయ జట్టులో అవకాశం వచ్చేదని.. కానీ ఇప్పుడు ఐపీఎల్ తరహా ప్లాట్‌ఫాంలతో మెరుగైన ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.మహిళల క్రికెట్‌ను బాగా ప్రోత్సహిస్తున్నామని.. వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ మదన్‌లాల్ మాట్లాడుతూ.. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఏసీఏ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు.
ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్‌ఆర్ గోపినాథరెడ్డి, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, ఏసీఏ పూర్వ కార్యదర్శి చాముండేశ్వర్‌నాథ్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, సీఈఓ శివారెడ్డి, వీడీసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment