
బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియమించబడ్డాడు. అధ్యక్షుడు రోజర్ బిన్నీ తన ప్రత్యేక అధికారాలు వినియోగించి సైకియాను కార్యదర్శిగా ఎంపిక చేశాడు. సైకియా ప్రస్తుతం బీసీసీఐ జాయింట్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. అసోంకు చెందిన సైకియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. మాజీ కార్యదర్శి జై షా ఐసీసీ పీఠాన్ని అధిరోహించిన నేపథ్యంలో సైకియా నియామకం అనివార్యమైంది.
ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జై షా జోడు పదవుల్లో కొనసాగలేడు. అందుకే అతను బీసీసీఐ కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు. శాశ్వత కార్యదర్శిని ఎప్పుడు నియమిస్తారో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో బీసీసీఐ ఎన్నికలు జరుగనున్నాయి. అప్పుడే శాశ్వత కార్యదర్శి పదవిని కూడా భర్తీ చేసే అవకాశం ఉంది.