తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైనప్పుడు భారత్ 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమ్ ఆలౌట్ అయ్యే సమయానికి ఆ ఆధిక్యం 190 పరుగులకు చేరింది. ముందుగా ఈ లోటును పూడ్చుకునే ప్రయత్నంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ శనివారం ఆట ముగిసేసరికి 126 పరుగులు ముందంజలో నిలిచింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ బ్యాటర్ల పోరాటం జట్టును ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఒలీ పోప్ అద్భుత బ్యాటింగ్‌తో చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌కు ముందు భారత గడ్డపై 9 ఇన్నింగ్స్‌లలో కలిపి 154 పరుగులే చేసిన పోప్ ఈ ఇన్నింగ్స్‌లోనే దాదాపు అన్నే పరుగులు సాధించడం విశేషం. అతని స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లకు భారత స్పిన్నర్ల వద్ద జవాబు లేకపోయింది. ఆధిక్యం మరీ ఎక్కువ కాదు కాబట్టి ఈ మ్యాచ్ ఇంకా టీమిండియా చేతుల్లోనే ఉంది. అయితే మారిపోతున్న పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్ సవాల్‌ను రోహిత్ బృందం ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం.
సాక్షి, హైదరాబాద్: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఓటమి ఖాయమనిపించే స్థితి నుంచి కోలుకొని ఇంకా పోరాడుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది.
ఒలీ పోప్ (208 బంతుల్లో 148 బ్యాటింగ్; 17 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 126 పరుగులు ముందంజలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 421/7తో ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 121 ఓవర్లలో 436 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (180 బంతుల్లో 87; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు.
మరో 15 పరుగులు జోడించి...
మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసేందుకు 11 ఓవర్లు సరిపోయాయి. ఒకేస్కోరు వద్ద జట్టు చివరి 3 వికెట్లు కోల్పోయింది. రూట్ వరుస బంతుల్లో జడేజా, బుమ్రా (0)లను అవుట్ చేయగా... తర్వాతి ఓవర్లో అక్షర్ పటేల్ (100 బంతుల్లో 44; 7 ఫోర్లు, 1 సిక్స్)ను రేహన్ బౌల్డ్ చేశాడు.
రాణించిన డకెట్...
తొలి ఇన్నింగ్స్‌లాగే రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ శుభారంభం చేసింది. క్రాలీ (33 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), డకెట్ కలిసి చకచకా పరుగులు జోడించారు. అశ్విన్ చక్కటి బంతితో క్రాలీని అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీసినా... డకెట్, పోప్ జోరుగా ఆడటంతో తొలి సెషన్ ముగిసేసరికి జట్టు 6 రన్‌రేట్‌తో 15 ఓవర్లలోనే 89 పరుగులు చేసింది. అయితే లంచ్ తర్వాత భారత బౌలర్లు ఒక్కసారిగా చెలరేగిపోయారు.
బుమ్రా బౌలింగ్‌లో డకెట్ ఎల్బీ అయ్యే అవకాశం ఉన్నా... భారత్ రివ్యూ తీసుకోకపోవడంతో అతను బతికిపోయాడు. రీప్లేలో బంతి స్టంప్స్‌ను తాకేదని తేలడంతో బుమ్రా తీవ్రంగా నిరాశ చెందాడు. అయితే తన తర్వాతి ఓవర్లో అద్భుత బంతితో డకెట్‌ను బౌల్డ్ చేసిన భారత పేసర్ భావోద్వేగం ప్రదర్శించాడు. జట్టు టాప్ బ్యాటర్ రూట్ (6 బంతుల్లో 2)ను కూడా తన తర్వాతి ఓవర్లోనే బుమ్రా అవుట్ చేశాడు.
జడేజా బంతిని ఆడకుండా వదిలేసి బెయిర్‌స్టో (24 బంతుల్లో 10; 1 ఫోర్) బౌల్డ్ కాగా... బెన్ స్టోక్స్ (33 బంతుల్లో 6)కు వరుసగా మూడు ఓవర్లు మెయిడిన్ వేసి ఒత్తిడి పెంచిన అశ్విన్ అదే జోరులో చక్కటి బంతితో అతని ఆట కట్టించాడు. మరోవైపు పోప్ మాత్రం చక్కటి షాట్లతో పరుగులు రాబడుతూ 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
భారీ భాగస్వామ్యం...
స్టోక్స్ ఐదో వికెట్‌గా వెనుదిరిగినప్పుడు ఇంగ్లండ్ స్కోరు 163/5. ఆ జట్టు మరో 27 పరుగులు వెనుకబడి ఉంది. ఈ దశలో భారత్ మిగిలిన వికెట్లను టపటపా పడగొట్టి మ్యాచ్‌ను ముగిస్తుందని అనిపించింది. అయితే మరో 30 ఓవర్ల పాటు పోప్, బెన్ ఫోక్స్ (81 బంతుల్లో 34; 2 ఫోర్లు) కలిసి భారత బౌలర్లను ఆడుకున్నారు. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టారు. ఆరంభంలో కుదురుకునేందుకు కొంత సమయం తీసుకున్న తర్వాత ధాటిగా ఆడారు.
భారత బౌలర్లలోనూ ఎవరూ వీరిని ఇబ్బంది పెట్టలేకపోయారు. దాంతో ముందుగా తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చుకున్న ఇంగ్లండ్... ఆ తర్వాత ఆధిపత్యాన్ని పెంచుకుంటూ పోయింది. ఈ క్రమంలో పోప్ 154 బంతుల్లో తన కెరీర్‌లో ఐదో టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరో వికెట్‌కు పోప్‌తో 112 పరుగులు జత చేసిన ఫోక్స్‌ను అక్షర్ బౌల్డ్ చేయడంతో భారత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది.
అయితే రేహన్ (31 బంతుల్లో 16 బ్యాటింగ్; 2 ఫోర్లు) కలిసి పోప్ మరో వికెట్ పడకుండా మూడో రోజును జాగ్రత్తగా ముగించాడు. చివరి సెషన్‌లో ఇంగ్లండ్ 35 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి 144 పరుగులు సాధించింది. 110 పరుగుల వద్ద పోప్ ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 436 ఆలౌట్; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) రోహిత్ (బి) అశ్విన్ 31; డకెట్ (బి) బుమ్రా 47; పోప్ (బ్యాటింగ్) 148; రూట్ (ఎల్బీ) (బి) బుమ్రా 2; బెయిర్‌స్టో (బి) జడేజా 10; స్టోక్స్ (బి) అశ్విన్ 6; ఫోక్స్ (బి) అక్షర్ 34; రేహన్ (బ్యాటింగ్) 16; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (77 ఓవర్లలో 6 వికెట్లకు) 316. వికెట్ల పతనం: 1–45, 2–113, 3–117, 4–140, 5–163, 6–275. బౌలింగ్: బుమ్రా 12–3–29–2, అశ్విన్ 21–3–93–2, అక్షర్ 15–2–69–1, జడేజా 26–1–101–1, సిరాజ్ 3–0–8–0.
Comments
Please login to add a commentAdd a comment