భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు ఊహించిన దిశలోనే సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన టీమిండియా రెండో రోజు తమ బ్యాటింగ్ సత్తా చూపించింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చక్కటి అర్ధసెంచరీలకు తోడు శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్ సమయోచిత సహకారం జట్టును భారీ ఆధిక్యంలో నిలిపాయి. శుక్రవారం 3.47 రన్‌రేట్‌తో 87 ఓవర్లలోనే 302 పరుగులు సాధించిన టీమిండియాకు టెస్టుపై పట్టు చిక్కింది.
పేలవ బౌలింగ్‌తో భారత్‌ను నిలువరించడంలో విఫలమైన ఇంగ్లండ్ ఇప్పటికే దాదాపుగా చేతులెత్తేసింది. రెండో రోజు ఒక రనౌట్‌ను మినహాయిస్తే ఆ జట్టు ఐదు వికెట్లే తీయగలిగింది. మరో మూడు వికెట్లతో భారత్ తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉండగా... ఇంగ్లండ్ ఎంతవరకు పోరాడుతుందనేది చూడాలి.
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్ బలంతో భారత జట్టు ఇంగ్లండ్‌పై తొలి టెస్టులో ఆధిపత్యాన్ని కొనసాగించింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (123 బంతుల్లో 86; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (155 బంతుల్లో 81 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... కోన శ్రీకర్ భరత్ (81 బంతుల్లో 41; 3 ఫోర్లు), అక్షర్ పటేల్ (62 బంతుల్లో 35 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (63 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
ఇప్పటికే భారత్ 175 పరుగుల ఆధిక్యంలో ఉండగా... క్రీజ్‌లో ఉన్న జడేజా, అక్షర్ ఎనిమిదో వికెట్‌కు అభేద్యంగా 63 పరుగులు జోడించారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత్ ఐదు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయగా... మూడింటిలో జడేజా ఉన్నాడు. భారత్ టాప్–5 బ్యాటర్లంతా దూకుడుగా ఆడబోయి అటాకింగ్ షాట్లకే వెనుదిరగడం విశేషం.
సమష్టి బ్యాటింగ్‌తో...
ఓవర్‌నైట్ స్కోరు 119/1తో ఆట కొనసాగించిన భారత్ తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (74 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో ఉన్నంత సేపు ఇబ్బందిగానే కనిపించిన శుబ్‌మన్ గిల్ (66 బంతుల్లో 23; 2 ఫోర్లు) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయితే రాహుల్, శ్రేయస్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. శ్రేయస్ భారీ స్కోరు చేయడంలో విఫలం కాగా... 72 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. వుడ్ ఓవర్లో అతను కొట్టిన మూడు ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి.
రేహన్ ఓవర్లో రాహు ల్ రెండు సిక్సర్లు బాదడంతో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది. అయితే అతను సెంచరీ చాన్స్‌ను పోగొట్టుకున్నాడు. రాహుల్ పెవిలియన్‌కు చేరిన సమయంలో భారత్ 42 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. దాంతో చివరి వికెట్ల తీయగల మని ఇంగ్లండ్‌కు ఆశ కలిగింది. కానీ జడేజా వాటిని వమ్ము చేశాడు. ముందుగా భరత్‌తో, ఆ తర్వాత అక్షర్ పటేల్‌తో అతను రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఆంధ్ర ఆటగాడు భరత్ పెద్ద స్కోరు సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 84 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ చేశాడు. జడేజాతో సమన్వయలోపంతో అశ్విన్ (1) రనౌట్ కావడం ఒక్కటే కాస్త నిరాశపర్చింది. తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శిస్తూ అక్షర్ కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ బౌలర్లు బేలగా చూస్తుండిపోయారు. హార్లీ వేసిన చివరి ఓవర్లో అక్షర్ వరుసగా 4, 6, 4 బాది రోజును ముగించాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి అండ్ బి) రూట్ 80; రోహిత్ (సి) స్టోక్స్ (బి) లీచ్ 24; గిల్ (సి) డకెట్ (బి) హార్లీ 23; రాహుల్ (సి) రేహన్ (బి) హార్లీ 86; శ్రేయస్ (సి) హార్లీ (బి) రేహన్ 35; జడేజా (బ్యాటింగ్) 81; భరత్ (ఎల్బీ) (బి) రూట్ 41; అశ్విన్ (రనౌట్) 1; అక్షర్ పటేల్ (బ్యాటింగ్) 35; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (110 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 421. వికెట్ల పతనం: 1–80, 2–123, 3–159, 4–223, 5–288, 6–356, 7–358. బౌలింగ్: వుడ్ 13–0–43–0, హార్లీ 25–0–131–2, లీచ్ 25–6–54–1, రేహన్ 23–3–105–1, రూట్ 24–2–77–2.
Comments
Please login to add a commentAdd a comment