బ్రిటీష్ ప్రభుత్వ హయాం నుంచి మొన్నటి వరకూ గొలుసులతో సర్వే చేసేవారు. అందువల్ల ఎకరానికి కొన్ని అడుగులు/ కొన్ని గజాలు తేడా వచ్చేది. అధికారికంగానే కొంత అటూ ఇటూగా అనుమతించేవారు. దీంతో ఎప్పుడైనా క్రయవిక్రయాలు జరిగినప్పుడు హద్దుల విషయంలో అక్కడక్కడ గొడవలు చోటుచేసుకునేవి. ఇకపై ఇలాంటి గొడవలకు తావే ఉండదు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో రీ సర్వే చేస్తుండటం వల్ల సెంటీమీటర్లతో సహా లెక్క తేలుతోంది.
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా వందేళ్ల తర్వాత రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. అస్తవ్యస్తంగా, తప్పుల తడకగా ఉన్న భూ రికార్డులను స్వచ్ఛీకరణ చేసి, వివాదాలను పూర్తిగా రూపు మాపడమే లక్ష్యంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం కింద చేపట్టిన రీ సర్వే వెయ్యికిపైగా గ్రామాల్లో దాదాపు పూర్తయింది. రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున 51 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన రీసర్వేను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పూర్తి చేశారు.
వీటి ఆధారంగా మిగిలిన గ్రామాల్లో వేగంగా సర్వే ప్రక్రియ మొదలు పెట్టారు. దీంతో ఇప్పటి వరకు 529 గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. ఆ గ్రామాల్లో పాత భూముల రికార్డుల స్థానంలో ట్యాంపరింగ్‌కు అవకాశం లేని విధంగా కొత్త భూముల రికార్డులు తయారయ్యాయి. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను కూడా పరిష్కరించి సరిహద్దులు నిర్ణయించారు. వాటి ప్రకారం గ్రానైట్ రాళ్లు కూడా పాతారు. తద్వారా ఆయా భూ యజమానులకు వారి భూములపై శాశ్వత హక్కులు కల్పించారు.
ఆ గ్రామాల్లో పక్కాగా రెవెన్యూ రికార్డులు
- రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో డిజిటలైజ్డ్ రెవెన్యూ రికార్డులు పక్కాగా రూపొందాయి. ఎఫ్‌ఎంబీ (ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్) స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్‌పీఎం – భూ కమతాల మ్యాప్) పుస్తకం, ఆర్‌ఎస్‌ఆర్ స్థానంలో రీసర్వే ల్యాండ్ రిజిçస్టర్, కొత్త 1బి రిజిస్టర్, అడంగల్ రిజిస్టర్, రెవెన్యూ గ్రామ మ్యాప్‌లు రూపొందాయి. ఇవన్నీ తాజా వివరాలు, తాజా భూ యజమానుల వివరాలతో నమోదయ్యాయి.
- ఇప్పటి వరకు ఉన్న రికార్డుల్లో 1928లో బ్రిటీష్ ప్రభుత్వం సర్వే చేసి నిర్ధారించిన వివరాలు, అప్పటి భూ యజమానుల పేర్లు ఉన్నాయి.. ఇప్పటి వరకు సర్వే నంబర్లు ఉండగా, రీసర్వే తర్వాత ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు ఉంటాయి.
- ఎల్‌పీఎం పుస్తకంలో ప్రతి భూమికి సంబంధించిన మ్యాప్, యజమాని వివరాలు ఉంటాయి. క్యూ ఆర్ కోడ్ జియో కో ఆర్డినేట్స్‌తో ఎల్‌పీఎంలను ముద్రించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ భూమి వివరాలు తెలుస్తాయి. ఈ గ్రామాల్లో చనిపోయిన వారి పేర్లతో ఉన్న భూములను హక్కుదారుల పేర్లతో మ్యుటేషన్ చేశారు.
- ప్రతి ల్యాండ్ పార్సిల్ (ల్యాండ్ బిట్)కు త్వరలో ఆధార్ తరహాలో ఒక విశేష గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నారు. రీ సర్వే తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం 37 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు సైతం ప్రారంభించారు.
- ఇదిలా ఉండగా మరో 652 గ్రామాల్లో రీ సర్వే తుది దశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17,460 రెవెన్యూ గ్రామాలు (సర్వే పూర్తయినవి మినహా), 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని (అటవీ భూములు మినహా) భూములు, స్థలాలు, ఇళ్లు సర్వే చేసి, హద్దులు నిర్ణయించే మహా యజ్ఞాన్ని 2023 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అత్యాధునిక విధానంలో రీ సర్వే
– ప్రపంచంలోనే అత్యంత ఆధునిక విధానంలో హైబ్రిడ్ తరహాలో కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్), డ్రోన్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహిస్తున్నారు. డ్రోన్ సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు.
– వేలాది గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉండడంతో ప్రైవేటు కంపెనీల నుంచి కూడా డ్రోన్లను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు 26 జిల్లాల్లో 2,155 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. మిగిలిన గ్రామాల్లోను వేగంగా డ్రోన్ సర్వే చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
– 782 గ్రామాలకు సంబంధించిన 7.76 లక్షల ఎకరాల్లో క్షేత్ర స్థాయి నిజనిర్ధారణ అంటే డ్రోన్ చిత్రాలతో, భూ యజమానుల సమక్షంలో వాస్తవ హద్దులను పోల్చి చూసే ప్రక్రియ పూర్తయింది. సర్వే నిర్వహణలో గ్రామ సచివాలయ వ్యవస్థలోని గ్రామ సర్వేయర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. 11,128 గ్రామ సర్వేయర్లకు సర్వే సెటిల్మెంట్ శాఖ సంప్రదాయ, ఆధునిక సర్వే విధానాలపై శిక్షణ ఇవ్వడంతో వారు చురుగ్గా పని చేçస్తున్నారు.
ఆ గ్రామ సచివాలయంలో 102 రిజిస్ట్రేషన్లు
– ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్‌పేటలో రీ సర్వే పూర్తయింది. ఇప్పుడు ఈ గ్రామంలో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన ఎవరూ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లడం లేదు. భూములు, ఇళ్ల అమ్మకాలు, గిఫ్ట్ డీడ్‌లు వంటి రిజిస్ట్రేషన్లన్నీ గ్రామ సచివాలయంలోనే చేయించుకుంటున్నారు.
– ఇప్పటి వరకు అక్కడ 102 రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం. రీసర్వే పక్కాగా జరగడంతో గ్రామ సచివాలయంలో పాత భూముల రికార్డుల స్థానంలో కొత్త రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. 1928లో బ్రిటీష్ హయాంలో చేసిన సర్వే ప్రకారం గ్రామంలో 1,251.37 ఎకరాల భూమి ఉంది. రీ సర్వే తర్వాత 1,253.35 ఎకరాలు ఉన్నట్లు తేలింది.
– గతంలో గ్రామ కంఠం 54 ఎకరాలు ఉండగా, ఇప్పుడు 187 ఎకరాలకు పెరిగింది. వందేళ్లలో ఆ ప్రాంతంలో జాతీయ రహదారి ఏర్పడడం, పారిశ్రామిక ఇతర అభివృద్ధితో గ్రామ కంఠం పెరిగింది. ఫలితంగా పట్టా భూమి తగ్గినట్లు మండల సర్వేయర్ అనీష్ తెలిపారు.
సర్వేకు ముందు భూ వివరాలు
– మొత్తం భూమి : 1,251.37 ఎకరాలు
– పట్టా భూమి : 889.38 ఎకరాలు
– ప్రభుత్వ భూమి : 297.87 ఎకరాలు
– గ్రామ కంఠం : 54.11 ఎకరాలు
– అసైన్డ్ భూమి : 10.01 ఎకరాలు
– మొత్తం సర్వే నంబర్లు : 240
– సబ్ డివిజన్లు : 467
రీ సర్వే తర్వాత..
– మొత్తం భూమి : 1,253.35 ఎకరాలు
– పట్టా భూమి : 758.56 ఎకరాలు
– ప్రభుత్వ భూమి : 297.87 ఎకరాలు
– గ్రామ కంఠం : 187.23 ఎకరాలు
– అసైన్డ్ భూమి : 9.69 ఎకరాలు
– మొత్తం ఎల్‌పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు) : 610
ఏపీ రీసర్వేపై ఇతర రాష్ట్రాల ఆసక్తి
ఏపీలో రీసర్వే గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. మహారాష్ట్ర సర్వే సెటిల్మెంట్ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చి రీ సర్వేపై వివరాలు సేకరించింది. క్షేత్ర స్థాయికి వెళ్లి మరీ వాస్తవాలు తెలుసుకుని హర్షం వ్యక్తం చేసింది. అనుకున్నదానికంటే రీ సర్వే చక్కగా సాగుతోంది. వెయ్యికి పైగా గ్రామాల్లో సర్వే పూర్తయింది. రికార్డుల స్వచ్ఛీకరణ నుంచి కొత్త భూ రికార్డులు రూపొందించే వరకు 16 దశల ప్రక్రియను ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ నిర్దేశించిన గడువులోపు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తవుతుంది.
– కెజియా కుమారి, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ
అధికారులే హద్దులు నిర్ణయించి రాళ్లు పాతారు
నాకు, నా తమ్ముడికి కలిపి 4.17 ఎకరాల పొలం ఉంది. సర్వేలో కొలతలు బాగా వచ్చాయి. సర్వే చేశాక అధికారులే హద్దులు నిర్ణయించి రాళ్లు పాతించారు. మేమే రాళ్లు కొనుక్కోవాలంటే రూ.4, 5 వేలు ఖర్చవుతుంది. ప్రభుత్వమే రాళ్లు పాతించడం పట్ల ఆనందంగా ఉంది.
– మోచర్ల నాగయ్య, రైతు, షేర్ మహ్మద్‌పేట, జగ్గయ్యపేట మండలం
ఖర్చు లేకుండా సర్వే చేశారు
సర్వే నంబర్ 45లో నాకు ఉన్న 6 ఎకరాల పొలాన్ని రూపాయి ఖర్చు లేకుండా సర్వే చేసి, హద్దులు నిర్ణయించారు. నేను సర్వే చేయించుకోవాలంటే చాలా రోజులు పట్టేది. డబ్బూ ఖర్చయ్యేది. కానీ అధికారులే స్వయంగా వచ్చి సర్వే పూర్తి చేసి, హద్దు రాళ్లు పాతారు. చాలా సంతోషంగా ఉంది.
– కాకనబోయిన బిక్షమయ్య, రైతు, షేర్ మహ్మద్‌పేట, జగ్గయ్యపేట మండలం
Comments
Please login to add a commentAdd a comment