ఏపీలోని అంగన్‌వాడీలు.. పారదర్శక కేంద్రాలు | AP Govt Makes The Services Of Anganwadi Centers More Transparent | Sakshi
Sakshi News home page

ఏపీలోని అంగన్‌వాడీలు.. పారదర్శక కేంద్రాలు

Published Mon, Aug 16 2021 10:49 AM | Last Updated on Mon, Aug 16 2021 12:45 PM

AP Govt Makes The Services Of Anganwadi Centers More Transparent - Sakshi

సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ కేంద్రాల సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పటిష్ట చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీ కేంద్రాలంటే అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనే గత పరిస్థితిని చక్కదిద్ది తల్లీబిడ్డలకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ కేంద్రాలను మరింత పారదర్శకంగా నిర్వహించేలా తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. పైన పేర్కొన్న రెండు యాప్‌లు ఈ కేంద్రాల సేవల్ని మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికే యాప్‌ల నిర్వహణపై అంగన్‌వాడీ టీచర్లకు, అధికారులకు శిక్షణ ఇచ్చారు. ప్రతి మంగళవారం టీసీఎస్‌ సాంకేతిక నిపుణులతో వర్చువల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

వైఎస్సార్‌ యాప్‌లో అప్‌డేట్‌
రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో మొత్తం 32,59,042 మందికి అందించే పౌష్టికాహారంతోపాటు ఇతర సేవలను వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్‌ (మొబైల్‌ అప్లికేషన్‌)లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నారు. రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమశాఖ పర్యవేక్షణలో ఈ ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్‌లో సాంకేతిక లోపాలను చక్కదిద్దడంతో కొద్దిరోజులుగా మంచి ఫలితాలు ఇస్తోంది. దీన్ని యూజర్‌ ఫ్రెండ్లీగా రూపొందించడంతో పనితీరు బాగుంది. రాష్ట్రంలోని మొత్తం అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు 3,24,378 మంది, బాలింతలు 2,23,085 మంది, మూడేళ్లలోపు చిన్నారులు 15,64,445 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 11,47,134 మంది ఉన్నారు.

వారి వివరాలను వైఎస్సార్‌ యాప్‌లో అప్‌డేట్‌ చేసి వారిలో ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం, వైద్యం వంటి సేవలు అందుతున్నది లేనిది అప్‌డేట్‌ చేస్తున్నారు. లబ్ధిదారుల వివరాలను ఆధార్‌ నంబరుతో సహా అనుసంధానం చేశారు. పౌష్టికాహారం అందించి లబ్ధిదారుల బయోమెట్రిక్‌ సేకరిస్తారు. దీనివల్ల ఏ అంగన్‌వాడీ కేంద్రంలో ఎంతమందికి, ఎప్పుడు పౌష్టికాహార పంపిణీ జరిగిందనేది క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి లోపాలను చక్కదిద్దే వీలు కలుగుతుంది.

మిల్క్‌ వ్యాన్‌ ట్రాకింగ్‌
అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరాలో లోపాలు లేకుండా చేసేందుకు ఏపీ డెయిరీ ‘మిల్క్‌ యాప్‌’ను కొద్దిరోజుల కిందట అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని 181 స్టాక్‌ పాయింట్లకు పాల వ్యాన్‌ చేరుకునే వరకు జియో ట్రాకింగ్‌ సిస్టంతో ప్రత్యేక పర్యవేక్షణ జరుగుతోంది. ప్రతినెల సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ ద్వారా తల్లీబిడ్డలకు పంపిణీచేసే పాలప్యాకెట్ల వివరాలను యాప్‌లో అప్‌డేట్‌ చేయాలి. యాప్‌లో లబ్ధిదారుల బయోమెట్రిక్‌ సేకరించడం ద్వారా ఎటువంటి అవకతవకలకు తావులేకుండా చేస్తున్నారు.

  • రాష్ట్రంలో ఎంతమంది తల్లీబిడ్డలకు పౌష్టికాహార పంపిణీ జరిగింది. ఏయే ప్రాంతాల్లో పంపిణీ పూర్తయింది. ఇంకా ఎవరికైనా పౌష్టికాహారం అందకపోతే కారణాలేమిటి? ఇలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్‌’ దోహదం చేస్తుంది.
  • ఏ పాల వ్యాన్‌ ఎక్కడ బయలుదేరింది. నిర్దేశించిన ప్రాంతానికి ఎప్పటికి చేరింది.. ఇలా పాల వ్యాన్‌ బయలుదేరిన దగ్గర్నుంచి పాలు అందించేవరకు దాన్ని కనిపెట్టేలా జియో ట్రాకింగ్‌ దోహదం చేస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఏపీ డెయిరీ రూపొందించిన ‘మిల్క్‌ యాప్‌’లో అప్‌డేట్‌ అవుతుంటాయి. 

యాప్‌ల ద్వారా పారదర్శక పనితీరు
అంగన్‌వాడీ కేంద్రాలను పారదర్శకంగా పనిచేసేలా, పాలు, పౌష్టికాహార పంపిణీ పర్యవేక్షణకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, మిల్క్‌ యాప్‌లు ఉపయోగపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 37 వేలు, పట్టణ ప్రాంతాల్లోని దాదాపు 10 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ యాప్‌ల నిర్వహణ బాగుంది. గిరిజన ప్రాంతాల్లోని 8 వేల కేంద్రాల్లో మొబైల్‌ నెట్‌వర్క్, ఇంటర్నెట్‌ సమస్య కారణంగా సాంకేతిక సమస్యలు ఉన్నట్టు గుర్తించాం.

దీన్ని అధిగమించేలా గిరిజన ప్రాంతాల్లోని అంగన్‌వాడీ నిర్వాహకులకు ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశాం. వివరాలను నెట్‌వర్క్, ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్నచోటకు వచ్చి అప్‌డేట్‌ చేసే వెసులుబాటు కల్పించాం. వారికి కొద్దిరోజులు గడువు ఇచ్చి యాప్‌ల ద్వారా డేటాను అప్‌డేట్‌ చేయాలని ఆదేశాలిచ్చాం. అనంతపురం జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇవ్వాల్సిన పాలను నేలపాలు చేశారనే ఆరోపణల్లో నిజం లేదు. ఆ పాలు చెడిపోవడం వల్ల వాటిని అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేయడం సరికాదని, పూడ్చిపెట్టినట్లు విచారణలో తేలింది.
– కృతికాశుక్లా, మహిళా, శిశుసంక్షేమశాఖ సంచాలకులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement