సాక్షి, అమరావతి : ప్రీ ప్రైమరీ విద్యపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. 4 వేల కోట్ల రూపాయలతో అంగన్‌వాడీల్లో నాడు–నేడు కింద అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇకపై వైఎస్సార్ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా అంగన్ వాడీ కేంద్రాలు రూపుదిద్దుకోనున్నాయి. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రీ ప్రైమరీ స్కూల్స్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్‌వాడీల్లో పాఠ్య ప్రణాళిక-ఒకటో తరగతి పాఠ్య ప్రణాళికతో ట్రాన్సిషన్ ఉండాలన్నారు. ప్రీ ప్రైమరీకి ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, విద్యాశాఖకు తయారీ బాధ్యతను అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అంగన్‌వాడీ టీచర్లకు డిప్లమో కోర్సు ఉంటుందన్నారు. బోధనా పద్దతులు, పాఠ్య ప్రణాళిక, సులభమైన మార్గాల్లో పిల్లలకు విద్యా బోధనపై వారికి ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. ( వారి పట్ల ఉదారంగా వ్యవహరించండి : సీఎం జగన్)
నాడు– నేడు కింద అంగన్‌వాడీల అభివృద్ధి, కొత్త వాటి నిర్మాణం జరుగుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో పరిశుభ్రమైన తాగునీరు, బాత్‌రూమ్స్ నాడు-నేడు కింద స్కూళ్లకు ఇప్పుడు ఇస్తున్న సదుపాయాలన్నీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం అమ్మ ఒడి ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. ప్రీ ప్రైమరీ విద్యలో సంస్కరణలు తీసుకు వస్తున్నామని చెప్పారు. ప్రాథమిక దశ నుంచే సంపూర్ణ మార్పులకు శ్రీకారం చుడుతున్నామని అన్నారు. కార్యాచరణ తయారు చేసి నిర్ణీత సమయంలోగా వాటిని పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో ప్రీ ప్రైమరీ 1 (పీపీ–1), ప్రీ ప్రైమరీ 2 (పీపీ–2)కి సంబంధించి ప్రతిపాదిస్తున్న అంశాలను మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతిక శుక్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రస్తుతం పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, అంగన్‌వాడీల కార్యకలాపాలను వెల్లడించారు.
అంగన్‌వాడీలు–కార్యకలాపాలు :
వైఎస్సార్ సంపూర్ణ పోషక పథకంలో 7 నెలల వయసు నుంచి 6 ఏళ్ల వరకు పిల్లలతో పాటు, గర్భిణీలకు పోషకాహారం అందిస్తున్నట్లు కృతిక శుక్లా తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 55,607 అంగన్‌వాడీలలో 3 నుంచి 6 ఏళ్ల వరకు ఉన్న దాదాపు 8.70 లక్షల పిల్లలకు ప్రీ స్కూల్ విద్య అందిస్తున్నామని, వారికి చిన్నప్పటి నుంచే తెలుగుతో పాటు, ఇంగ్లిష్‌లో కూడా కొంచెం ప్రావీణ్యం కల్పించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నైతిక విలువలు, టీమ్ వర్క్, సెల్ఫ్ అవేర్‌నెస్, మోరల్స్‌పై వారికి అవగాహన కల్పించడంతో పాటు, న్యూట్రిషన్, ప్రొటెక్షన్, స్టిమ్యులేషన్ లక్ష్యాలుగా అంగన్‌వాడీల పని చేస్తున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతిక శుక్లా వివరించారు.
కొత్త సిలబస్–శిక్షణ :
అంగన్‌వాడీల్లోని విద్యార్థులకు అనుగుణమైన సిలబస్‌ను నిపుణులతో రూపొందించడంతో పాటు, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌పై అంగన్ వాడీ వర్కర్లకు శిక్షణ ఇస్తామని కృతిక శుక్లా చెప్పారు. ప్రతి నెలా వారు చెప్పాల్సిన సిలబస్‌పై శిక్షణలో భాగంగా, అంగన్‌వాడీ వర్కర్లకు బోధన విధానాలపై 4 పుస్తకాలు, పిల్లలకు 2 పుస్తకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి త్రైమాసికానికీ అసెస్‌మెంట్, ప్రతి పిల్లాడికీ గ్రాడ్యుయేషన్ బుక్స్, పిల్లలకు ప్రీ స్కూల్ కిట్స్ కలర్ కార్డులు, బిల్డింగ్ బ్లాక్స్, ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, చార్ట్స్, లెర్నింగ్ కిట్స్, బొమ్మలు ఇస్తామని వివరించారు.
డైలీ షెడ్యూల్ :
అంగన్‌వాడీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ప్రీ స్కూల్ ఉంటుందన్న మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ పిల్లలకు మధ్యలో గంటన్నర నిద్రకు విరామం ఇస్తామని వెల్లడించారు. ఇంకా రీడింగ్, స్టోరీ టైం, క్రియేటివ్ యాక్టివిటీ, యాక్షన్ సాంగ్, తదితర అంశాలతో రోజువారీ కార్యకలాపాలు ఉంటాయని తెలిపారు. పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించడంతో పాటు, వారి ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తామని ఆమె వివరించారు.
అంగన్‌వాడీ కేంద్రాలు–మార్పులు :
కాగా, రాష్ట్రంలోని మొత్తం అంగన్‌వాడీల్లోని 11,448 కేంద్రాలు పాఠశాలల్లోనే కొనసాగుతున్నాయని వివరించిన అధికారులు, వాటన్నింటిని కూడా నాడు–నేడు కార్యక్రమంలో బాగు చేస్తున్నామని వెల్లడించారు. మిగిలిన 44 వేల అంగన్‌వాడీలకు సంబంధించి కూడా నాడు–నేడు కింద అభివృద్ధి చేయడంతో పాటు, కొత్త నిర్మాణాలు చేపడతామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment