‘సుజల స్రవంతి’ టెండర్లలో 17.5 కోట్లు ఆదా | AP Govt Saves Above 17 Crores In Sujala Sravanti Scheme Tenders | Sakshi
Sakshi News home page

‘సుజల స్రవంతి’ టెండర్లలో 17.5 కోట్లు ఆదా

Published Sun, Jan 24 2021 5:41 AM | Last Updated on Sun, Jan 24 2021 5:41 AM

AP Govt Saves Above 17 Crores In Sujala Sravanti Scheme Tenders - Sakshi

సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం రెండో దశలో రెండు ప్యాకేజీల పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.17.50 కోట్లు ఆదా అయ్యాయి. మొదటి ప్యాకేజీ పనుల అంతర్గత అంచనా విలువ (ఐబీఎం) కంటే 0.24 శాతం తక్కువకు వీపీఆర్‌–పయనీర్‌–హెచ్‌ఈఎస్‌ (జేవీ), రెండో ప్యాకేజీ పనులను 0.67 శాతం తక్కువకు గాజా–ఎన్‌సీసీ(జేవీ) సంస్థలు దక్కించుకున్నాయి. టెండర్‌ ప్రక్రియపై పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ఎస్‌ఈ శ్రీనివాస్‌ యాదవ్‌ రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి నివేదిక పంపారు. ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని ఎస్‌ఎల్‌టీసీ సోమవారం సమావేశమై టెండర్‌ ప్రక్రియను పరిశీలన అనంతరం ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత పనులు దక్కించుకున్న ఆ సంస్థలకు వర్క్‌ ఆర్డర్‌ జారీ చేయనున్నారు.  

భారీ మొత్తంలో ఆదా 
పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. వద్ద నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 63.50 టీఎంసీల నీటిని తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. తొలి దశలో రూ.2,022 కోట్లతో పనులను ఇప్పటికే ప్రారంభించింది. ఇదే పథకంలో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశలో చేపట్టిన గ్రావిటీ కెనాల్‌లో 3.150 కి.మీ. నుంచి 23.200 కి.మీ. వరకూ కాలువ తవ్వకం, పాపయ్యపాలెం ఎత్తిపోతలతోపాటు 0 కి.మీ. నుంచి 40 కి.మీ. వరకూ లిఫ్ట్‌ కెనాల్‌ పనులకు మొదటి ప్యాకేజీ కింద రూ.2,512.96 కోట్ల ఐబీఎంతో టెండర్లు పిలిచింది. ఈ టెండర్‌లో ఆర్థిక బిడ్‌ను శనివారం అధికారులు తెరిచారు. రూ.2558.20 కోట్లకు కోట్‌ చేసిన సంస్థ ఎల్‌–1గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి ఈ–ఆక్షన్‌ (రివర్స్‌ టెండరింగ్‌) నిర్వహించారు.

రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఐబీఎం కంటే 0.24 శాతం తక్కువకు అంటే రూ.2,507.04 కోట్లకు కోట్‌ చేసిన వీపీఆర్‌–పయనీర్‌–హెచ్‌ఈఎస్‌(జేవీ) సంస్థ ఎల్‌–1గా నిలిచింది. దాంతో మొదటి ప్యాకేజీలో ఖజానాకు రూ.5.93 కోట్లు ఆదా అయ్యాయి. లిఫ్ట్‌ కెనాల్‌ 40 కి.మీ. నుంచి 102 కి.మీ. వరకూ చేపట్టే పనులకు రెండో ప్యాకేజీ కింద రూ.1,722.39 కోట్ల ఐబీఎంతో టెండర్‌ పిలిచింది. ఈ టెండర్‌లో ఆర్థిక బిడ్‌ను శనివారం అధికారులు తెరిచారు. 1,763.73 కోట్లకు కోట్‌ చేసిన సంస్థ ఎల్‌–గా నిలిచింది. అదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఐబీఎం కంటే 0.67 శాతం తక్కువకు అంటే రూ.1,710.82 కోట్లకు కోట్‌ చేసిన గాజా–ఎన్‌సీసీ (జేవీ) పనులను దక్కించుకుంది. దాంతో ఖజానాకు రూ.11.57 కోట్లు ఆదా అయ్యాయి. ఆర్థిక బిడ్‌లో ఎల్‌–1గా నిలిచిన సంస్థ కోట్‌ చేసిన ధరలతో పోల్చితే.. మొదటి ప్యాకేజీలో రూ.51.16 కోట్లు, రెండో ప్యాకేజీలో రూ.52.91 కోట్లు వెరసి రూ.104.07 కోట్లు ఆదా అయ్యాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement