సాక్షి ప్రతినిధి, కాకినాడ: వరదల వేళ గోదావరి నది పరీవాహక ప్రాంతాల ప్రజలు నిశ్చింతగా జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత పాలకుల నిర్లక్ష్యంతో గాలికొదిలేసిన ఔట్‌ఫాల్ స్లూయిజ్‌లు, పంట కాలువ గట్లు, డ్రెయిన్ల గట్లను పటిష్టం చేయాలని నిర్ణయించింది. దాదాపు పదిహేనేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పనులు తప్ప.. తరువాత వచ్చిన పాలకులెవరూ వీటి జోలికి పోలేదు. గోదావరి వరదలతో ముప్పు పొంచి ఉందని తెలిసినా నిర్లక్ష్యం చేశారు.
ఫలితంగానే గత నెల వరదలు పరీవాహక ప్రాంతాలతో పాటు గోదావరి లంకల్లోని ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేశాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు నిత్యం అప్రమత్తంగా వ్యవహరించడంతో కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలకు ముప్పు తప్పింది. ఇటీవల ఆయన స్వయంగా ముంపు బాధిత లంకల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పర్యటించి, పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆ సందర్భంలోనే తక్షణం పటిష్టం చేయాల్సిన కాలువ, డ్రెయిన్ గట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పలు మండలాల్లో 23 పనులు అత్యవసరమని గుర్తించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పనులకు రూ.5 కోట్లు మంజూరు చేశారు.
పునరావృతం కాకుండా..
గత నెలలో వచ్చిన వరదలతో ఎదురైన కష్టాలు భవిష్యత్తులో ఎదురు కాకుండా అత్యవసర పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఔట్‌ఫాల్ స్లూయిజ్‌లకు లీకేజీలు ఏర్పడి, భారీగా వరదలు వస్తే గట్లు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే తాజా పనుల్లో వాటికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవలి వరదలతో గోదావరి పాయల నుంచి నీరు పోటెత్తి పంట కాలువలపై నుంచి పొంగి ప్రవహించి, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. దెబ్బ తిన్న డ్రైన్ గట్ల వల్ల కూడా దాదాపు ఇదే పరిస్థితి ఏర్పడింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం.. తాజా పనుల్లో వీటికి ప్రాధాన్యం ఇచ్చింది.
ధవళేశ్వరం హెడ్ వర్క్స్ పరిధిలో..
సఖినేటిపల్లి మండలం గొంది వశిష్ట ఎడమ గట్టు, గోడి అవుట్‌ఫాల్ స్లూయిజ్ మరమ్మతులకు రూ.22 లక్షలు.
గోడి వశిష్ట ఎడమ గట్టు నొవ్వ అవుట్‌ఫాల్ స్లూయిస్‌జ్‌కు రూ.18 లక్షలు.
మామిడికుదురు మండలం లూటుకుర్రు వైనతేయ కుడిగట్టు వాడబోది అవుట్‌ఫాల్ స్లూయిజ్ పునర్నిర్మాణానికి రూ.8 లక్షలు.
ఆదుర్రు – వైనతేయ కుడిగట్టు బచ్చలబండ అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.5 లక్షలు.
గోగన్నమఠం వైనతేయ కుడిగట్టు కడలి అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.8 లక్షలు.
పి.గన్నవరం మండలం వైనతేయ ఎడమ గట్టున కె.ముంజవరం అవుట్‌ఫాల్ స్లూయిజ్ పరిధిలో కోతకు గురైన కట్ట మరమ్మతులకు రూ.10 లక్షలు.
ఐ.పోలవరం మండలం పాత యింజరం వద్ద అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.40 లక్షలు.
జి.మూలపొలం అవుట్‌ఫాల్ స్లూయిజ్ పునర్నిర్మాణానికి రూ.28 లక్షలు.
కేశనకుర్రు పీఐపీ వరద గట్టుపై అవుట్‌ఫాల్ స్లూయిజ్ పునర్నిర్మాణానికి రూ.45 లక్షలు.
కాట్రేనికోన మండలం గొల్లగరువు అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.38 లక్షలు.
ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి షట్టర్ల మరమ్మతులకు రూ.16 లక్షలు.
గౌతమి కుడి గట్టుపై ప్రధాన అవుట్‌ఫాల్ స్లూయిజ్ స్క్రూ గేరింగ్, షట్టర్ మరమ్మతులకు రూ.44 లక్షలు.
గోదావరి సెంట్రల్ డివిజన్‌లో..
1986 వరద స్థాయికి అనుగుణంగా అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద ఇరువైపులా ఐ.పోలవరం కుడి కాలువ గట్టు బలోపేతానికి రూ.40 లక్షలు.
అన్నంపల్లి అక్విడెక్ట్‌కు ఇరువైపులా ఐ.పోలవరం ఎడమ కాలువ గట్టు బలోపేతానికి రూ.25 లక్షలు.
అనాతవరం బ్రాంచి కెనాల్‌పై 0.80 కిలోమీటర్ వద్ద కల్వర్టు నిర్మాణానికి రూ.15 లక్షలు.
గన్నవరం ప్రధాన కాలువపై వరద గేట్లు, గన్నవరం అక్విడెక్ట్ రెయిలింగ్ మరమ్మతులకు రూ.80 లక్షలు.
రాజోలు, అమలాపురం డ్రైనేజీ సబ్ డివిజన్లలో..
ఇందుపల్లి ఎగువ కౌశిక మీడియం డ్రెయిన్ ఎడమ గట్టుకు రూ.6 లక్షలు.
బండారులంక ఎగువ కౌశిక కుడి ప్రధాన డ్రెయిన్Œ కుడి గట్టుకు రూ.4 లక్షలు.
సాకుర్రు మేజర్ డ్రెయిన్Œపై గట్లకు రూ.12 లక్షలు.
బండారులంక ఎగువ కౌశిక మీడియం డ్రెయిన్ కుడిగట్టుకు రూ.10 లక్షలు.
సాకుర్రు గున్నేపల్లి, సాకుర్రు మేజర్ డ్రెయిన్ గట్లకు రూ.10 లక్షలు.
రాజోలులో నామనపాలెం మీడియం డ్రెయిన్, కోతకు గురైన ఒడ్డుకు రూ.15 లక్షలు.
పొన్నమండ–2 డ్రెయిన్ అవుట్‌ఫాల్ స్లూయిజ్ షట్టర్ల మరమ్మతులకు రూ.5 లక్షలు.
త్వరలో పనులు మొదలుపెడతాం
ఈ రోజే పనులకు ఆమోదం తెలియచేశాం. వీటిని అత్యవసరంగా చేపట్టాల్సి ఉంది. వివిధ శాఖలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని, వరదల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులకు ఆమోదం తెలియజేశాం. వీటితో పాటు శాశ్వత ప్రాతిపదికన చేపట్టే పనులు కూడా మరికొన్ని ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులతో ముందుగా అత్యవసర పనులు చేపడుతున్నాం. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనుకుంటున్నాం. త్వరలో టెండర్లు కూడా పిలిచి పనులు వేగవంతం చేస్తాం.
– హిమాన్షు శుక్లా, కలెక్టర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
అత్యవసర పనులు చేపడుతున్నారు
కలెక్టర్ ఆదేశాల మేరకు అత్యవసర పనులను ప్రతిపాదించాం. గోదావరి హెడ్‌వర్క్స్ డివిజన్‌లో ఇవి చాలా కీలకమైనవి. ఇటీవలి వరదలతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లు, వాటి షట్టర్లు పటిష్టమైతే వరదల సమయంలో ప్రమాదాలను చాలా వరకూ నియంత్రించవచ్చు. ఇందుకు తగ్గట్టుగానే ఈ పనులు మొదలు
పెట్టనున్నాం.
– ఆర్.కాశీవిశ్వేశ్వరరావు, ఈఈ, గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం
నిధుల కేటాయింపు ఇలా..
అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లకు : రూ.2.82 కోట్లు
పంట కాలువ గట్ల రక్షణకు : రూ.1.60 కోట్లు
డ్రెయిన్ల గట్ల పటిష్టతకు : రూ.62 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment