నమో డ్రోన్ దీదీ కింద దేశంలోనే ఏపీకి అత్యధికం
డ్రోన్స్ కేటాయింపులో దేశంలో ఏపీ మూడో స్థానం
లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డ్రోన్స్ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. గత ఆర్థిక ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి అత్యధికంగా డ్రోన్స్ మంజూరు చేయించారు. ఈ విషయాన్ని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నమో డ్రోన్ దీదీ పథకం కింద స్వయం సహాయక సంఘాలకు మూడేళ్ల కాలంలో 15 వేల డ్రోన్స్ సమకూర్చడం ద్వారా స్థిరమైన వ్యాపారం, జీవనోపాధికి మద్దతు అందించాలని గత ఆర్థిక ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా డ్రోన్ దీదీ పథకం కింద దేశవ్యాప్తంగా 1,094 డ్రోన్స్‌ను స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేసింది. వీటిలో ఏపీకి 108 డ్రోన్స్‌ను సమకూర్చింది. దేశంలో మొత్తం డ్రోన్స్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. దేశంలో మొత్తం 500 డ్రోన్స్ సమకూర్చగా.. ఏపీకి అత్యధికంగా 96 డ్రోన్స్ ఇచ్చింది. ఏపీ తరువాత కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎక్కువ డ్రోన్స్ మంజూరయ్యాయి.
గుర్తింపు పొందిన రిమోట్ పైలట్ శిక్షణ కేంద్రాల ద్వారా స్వయం సహాయక సంఘాలకు 15 రోజుల పాటు శిక్షణ కూడా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రధానంగా పురుగు మందుల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. మహిళా రైతులకు శిక్షణలో డ్రోన్ ఫ్లైయింగ్, డ్రోన్ నియమాలపై అవగాహన కూడా కల్పిస్తున్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగం శిక్షణలో డ్రోన్ తయారీ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థల నిపుణులు ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment