సాక్షి, అమరావతి: కనీస వివరాలు లేకుండా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మఒడి పథకానికి రూ.24.24 కోట్ల నిధుల విడుదలకు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్‌కు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాది చింతా ఉమామహేశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గత వారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, ప్రాథమిక సమాచారం లేకుండా పిల్ దాఖలు చేయడమే కాక, వివరాలు కోరితే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశామని ఎలా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తగిన సమాచారం లేకుండా ఇలాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో కోర్టు సమయాన్ని వృథా చేయడం తగదని పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, సీజే ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి సమాచారంతో తిరిగి పిల్ దాఖలు చేసుకోవచ్చంది.
‘ఈ–వాచ్’పై తదుపరి విచారణ 25కి వాయిదా
పంచాయతీ ఎన్నికల నిర్వ హణకోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) సొంతంగా ఈ–వాచ్ పేరుతో యాప్‌ను రూపొందించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ–వాచ్ యాప్ విషయంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్(ఏపీటీఎస్‌ఎల్) లేవనెత్తిన సందేహాలు, అభ్యంతరాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చిందని, దీన్ని పరిశీలించేందుకు సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. దీంతో తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ–వాచ్ యాప్‌ను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులివ్వడంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ యాప్‌లైన ‘సీ–విజిల్’, ‘నిఘా’లను ఉపయోగించేలా ఆదేశాలివ్వాలంటూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు న్యాయవాది కట్టా సుధాకర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇవే అభ్యర్థనలతో గుంటూరు జిల్లా తెనాలి, బుర్రిపాలెంలకు చెందిన ఎ.నాగేశ్వరరావు, ఎ.అజయ్‌కుమార్‌లు వేర్వేరుగా పిల్స్ వేశారు.
మాపై కేసులు కొట్టేయండి
హైకోర్టులో పౌర హక్కుల సంఘం, విరసం నేతల పిటిషన్లు
సాక్షి, అమరావతి: తమపై విశాఖపట్నం జిల్లా, ముంచంగిపుట్టు, గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ పౌర హక్కుల సంఘం, కుల నిర్మూలన వ్యతిరేక పోరాట సమితి, విరసం సభ్యులతో పాటు మరికొంతమంది దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ పౌర హక్కుల సంఘం నేత చిలుకా చంద్రశేఖర్ మరికొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్, గంటా రామారావు, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి స్థాయి వాదనల నిమిత్తం విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు.
సివిల్ జడ్జిల భర్తీ అర్హతపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: మూడేళ్లపాటు న్యాయవాద వృత్తి చేసిన వారే జూనియర్ సివిల్ జడ్జి పదవికి అర్హులంటూ ఆంధ్రప్రదేశ్‌లో జారీ అయిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ రేగలగడ్డ వెంకటేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హృషీకేశ్‌రాయ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. మూడేళ్ల న్యాయవాద వృత్తి చేసిన వారే సబార్డినేట్ కోర్టుల్లో న్యాయమూర్తుల పదవులకు అర్హులంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, పిటిషన్ ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌కు సూచించిన ధర్మాసనం పిటిషన్ కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.
అమ్మఒడి పథకంపై పిల్ మూసివేత
Published Thu, Feb 18 2021 6:04 AM | Last Updated on Thu, Feb 18 2021 6:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment