సాక్షి, అమరావతి: సంగం డెయిరీకి సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై లోతుగా విచారణ జరపాల్సిన అవసరముందని.. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం కోరినట్లుగా సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తే జీవో 19 అమల్లోకి వస్తుందని.. అందువల్ల పూర్తి విచారణ జరపకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. సంగం డెయిరీని ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ గత నెల 27న జారీ చేసిన జీవో 19 అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల రద్దు కోరుతూ పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇటీవల హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.
ప్రజల ఆస్తులు ప్రైవేటు చేతుల్లో ఉండకూడదనే..
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో 19 ఇచ్చినట్లు తెలిపారు. సింగిల్ జడ్జి తన ఉత్తర్వుల్లో తాము ప్రస్తావించిన తీర్పుల గురించి కూడా రాయలేదని తెలిపారు. సంగం డెయిరీ పలు ఉల్లంఘనలకు పాల్పడిందని వివరించారు. న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ జోక్యం చేసుకుంటూ.. తాము ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సంగం డెయిరీపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని చెప్పారు. తమ వాదనలు వినాలని కోరినా సింగిల్ జడ్జి పట్టించుకోలేదని తెలిపారు.
జీవో 19ని నిలుపుదల చేయడమంటే అక్రమాలను సమర్ధించినట్లవుతుందన్నారు. సింగిల్ జడ్జి వద్ద తాము వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై పిటిషనర్ కూడా అభ్యంతరం తెలపలేదన్నారు. సంగం డెయిరీ న్యాయవాది ఆదినారాయణరావు జోక్యం చేసుకుంటూ.. తాము అభ్యంతరం తెలిపామని చెప్పారు. దీన్ని ప్రభునాథ్ ఖండించారు. ఈ సమయంలో ఇద్దరు న్యాయవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. ధర్మాసనం అభ్యంతరం తెలుపుతూ.. న్యాయవాదులు ప్రతి కేసులో ఇలా వాగ్వాదానికి దిగడం సరికాదని హితవు పలికింది. ఏజీ శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ.. కొందరు న్యాయవాదులు తీవ్ర స్వరంతో కోర్టులను శాసిస్తున్నట్లు మాట్లాడుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించింది.
ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సంగం డెయిరీలో ఆస్తుల బదలాయింపుతో పాటు ఇతర అక్రమాలపై ఏసీబీ నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. కేసు పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఏసీబీని ఆదేశించింది.
డెయిరీ ఆస్తుల బదలాయింపుపై నోటీసులు
తదుపరి విచారణ 20కి వాయిదా
ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆస్తులను గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(అమూల్)కు అప్పగిస్తూ రాష్ట్ర మంత్రి మండలి ఈ నెల 4న చేసిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తదుపరి విచారణను ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి మండలి తీర్మానాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించడంతో పాటు ప్రభుత్వం గతేడాది జారీ చేసిన జీవో 25ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేశారు. దీనిని ధర్మాసనం సోమవారం విచారించింది.
Comments
Please login to add a commentAdd a comment