
సాక్షి, అమరావతి: కోనసీమ అల్లర్లకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు అరిగెల వెంకట రామారావుకు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న నాలుగు పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కోనసీమ అల్లర్ల విషయంలో నమోదైన ఫిర్యాదుల్లోనూ, సాక్షుల వాంగ్మూలాల్లోనూ పిటిషనర్ పేరు ఉందని తెలిపింది.
అల్లర్లు జరగడంలో పిటిషనర్‌ది కీలకపాత్ర అని, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపారని, దీనివల్ల హింస జరిగిందని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంతరెడ్డి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. అందువల్ల ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందన్న ఏపీపీ వాదనకు అంగీకారం తెలిపింది.
పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా సాగేందుకు పిటిషనర్‌ను విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు వెల్లడించింది. అందువల్ల రామారావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి తీర్పునిచ్చారు.
కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కొందరు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి అధికార పార్టీ నేతల ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టే వరకు వెళ్లింది. దీనిపై అమలాపురం పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇలా కేసు నమోదైన వారిలో టీడీపీ నేత రామారావు కూడా ఉన్నారు.
పిటిషనర్ పాత్రపై ఆధారాలున్నాయి..
పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ర్యాలీ పేరుతో కార్యక్రమం చేపట్టి.. తరువాత పెద్ద ఎత్తున అనుచరులను కూడగట్టి హింసకు పాల్పడ్డారని తెలిపారు.
అంతకు ముందు వెంకట రామారావు తరఫు న్యాయవాది ఎన్.రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ అమాయకుడన్నారు. అల్లర్లతో ఆయనకు సంబంధం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఫిర్యాదుల్లోనూ, సాక్షుల వాంగ్మూలాల్లోనూ పిటిషనర్ పేరు ఉండటం వల్ల వెంకట రామారావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment