సాక్షి, అమరావతి: విస్తృత సర్క్యులేషన్ కలిగిన ఏదైనా ఓ దినపత్రికను కొనుగోలు చేసుకునేందుకు సచివాలయాలు, వలంటీర్లకు నెలకు రూ.200 ఆర్థిక సాయాన్ని అందచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలును నిలిపివేయాలంటూ ‘ఈనాడు’ పత్రిక చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. వలంటీర్లు, సచివాలయాలు ‘సాక్షి’ దినపత్రికను కొంటే... ఆ కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకోవద్దంటూ ఆడిట్ బ్యూరో సర్కులేషన్ (ఏబీసీ)ను ఆదేశించాలన్న అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది.
ఈ మేరకు ఈనాడు దాఖలు చేసిన రెండు అనుబంధ వ్యాజ్యాలను కొట్టివేసింది. సర్క్యులేషన్ దారుణంగా పడిపోవటంతో.. ఏబీసీ ఆడిట్‌లో తన అసలు సర్క్యులేషన్ బండారం బయటపడుతుందని, ఇన్నాళ్లూ తాను రకరకాలుగా కాపాడుకుంటూ వస్తున్న నంబర్–1 స్థానం పోతుందనే భయంతో ‘ఈనాడు’ పత్రిక ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... నిర్దిష్టంగా ఫలానా పత్రికను మాత్రమే కొనుగోలు చేయాలంటూ వలంటీర్లను గానీ, సచివాలయాలను గానీ ప్రభుత్వం ఆదేశిస్తున్నట్లుగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని స్పష్టం చేసింది.
రూ.200 ఆర్థిక సాయాన్ని వలంటీర్లకు, సచివాలయాలకు ‘సాక్షి’ దినపత్రికను మాత్రమే కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో ఇస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని లోతైన విచారణ జరిపి తేలుస్తామని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ‘ఈనాడు’ చేస్తున్న ఆరోపణల ఆధారంగా... ‘సాక్షి’ కొనుగోళ్లను పెంచుకునేందుకే ప్రభుత్వం రూ.200 ఆర్థిక సాయం చేస్తోందన్న ప్రాథమిక నిర్ణయానికి ఈ దశలో రాలేమని తేల్చి చెప్పింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ప్రస్తావించిన కీలకాంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఇది సాక్షి – ఈనాడు మధ్య వ్యాపార సంబంధిత వివాదమని ధర్మాసనం అభిప్రాయపడింది. సాధారణంగా ఇద్దరి మధ్య జరిగే ఇలాంటి వ్యాపార యుద్ధాల్లో న్యాయస్థానాలు మధ్యంతర ఉత్తర్వుల దశలో అరుదుగా మాత్రమే జోక్యం చేసుకుంటాయని వ్యాఖ్యానించింది.
జీవోలు రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్
ఏదైనా పత్రిక కొనుగోలు నిమిత్తం గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాలకు నెలకు రూ.200 ఆర్థిక సాయంతో పాటు బడ్జెట్ కేటాయింపుల జీవోలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలంటూ ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈనాడు) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వలంటీర్లు, సచివాలయాల ద్వారా జరిగే సాక్షి దినపత్రిక కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో సర్కు్యలేషన్ (ఏబీసీ)ను ఆదేశించడంతో పాటు నిర్దిష్ట కాలాల్లో సాక్షి పత్రికకు ఇచ్చిన సర్క్యులేషన్ సర్టిఫికేషన్‌ను పునఃసమీక్షించేలా ఆదేశించాలంటూ ఉషోదయ డైరెక్టర్ ఐ.వెంకట్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడం తెలిసిందే.
ప్రభుత్వ జీవోల అమలును నిలిపివేయడంతో పాటు 2022 జూలై–డిసెంబర్, ఆ తరువాత కాలానికి సాక్షి సర్క్యులేషన్‌ను ఆడిట్ చేయకుండా ఏబీసీని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ రెండు అనుబంధ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సీజే ధర్మాసనం మొదట ఈ అనుబంధ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. అటు ఈనాడు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్నది. మంగళవారం ఈ అనుబంధ వ్యాజ్యాల్లో ఉత్తర్వులు వెలువరించింది.
శాసనసభ స్వతంత్ర వ్యవస్థ
‘ఈనాడుపై నిషేధం విధిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం విషయానికొస్తే శాసనసభ అన్నది స్వతంత్ర వ్యవస్థ. దాని చర్యలను ఈనాడు తన పిటిషన్‌లో సవాలు చేయలేదు. ఇక సాక్షి సర్క్యులేషన్ లెక్కల విషయానికొస్తే ఏబీసీ మాత్రమే సర్క్యులేషన్ గణాంకాలను విడుదల చేస్తుంది. వీటిని విశ్వసిస్తూ ఈనాడు తన వ్యాజ్యంలో ప్రస్తావించింది కాబట్టి ఏబీసీ గణాంకాలను తారుమారు చేయవచ్చని ఈ దశలో భావించలేం.
ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఓ పత్రిక లేదా ఇతర పత్రికల కొనుగోళ్లు పెరిగితే ఆ వివరాలను తాజాగా సర్క్యులేషన్ గణాంకాలను విడుదల చేసేందుకు ఏబీసీ ఉపయోగించుకుంటుంది. ప్రభుత్వం విడుదల చేసే నిధుల వల్ల వలంటీర్లు, సచివాలయాలు నిర్దిష్టంగా ఓ పత్రికను కొనుగోలు చేసినంత మాత్రాన సర్క్యులేషన్ గణాంకాలను విడుదల చేయకుండా ఏబీసీని ఏ రకంగానూ నిరోధించలేం.
చదవండి: బాకీలంటూ.. తప్పుడు బాకాలు.. ఇదేం జర్నలిజం రామోజీ?
రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టంగా ఓ పత్రికను మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలను చూపలేదు’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈనాడు దాఖలు చేసిన రెండు అనుబంధ వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్తర్వుల్లో తాము వ్యక్తం చేసినవి కేవలం అనుబంధ వ్యాజ్యాలకు మాత్రమే పరిమితమని, ప్రధాన వ్యాజ్యాన్ని పరిష్కరించే విషయంలో ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment