
సాక్షి, అమరావతి: మీడియాతో ఈ నెల 17వ తేదీ వరకు మాట్లాడకుండా తనను నిరోధిస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. మీడియాతో మాట్లాడుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పిటిషన్‌పై లంచ్ మోషన్ ద్వారా అత్యవసర విచారణకు న్యాయమూర్తి డీవీఎస్‌ఎస్ సోమ యాజులు అంగీకరించారు. జోగి రమేశ్ తరఫు న్యాయవాది వీఆర్‌ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. మూడు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ఈ ఉత్తర్వులిచ్చే ముందు పిటిషనర్‌కు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, వివరణ తీసుకోలేదని తెలిపారు. మీడియాతో మాట్లాడటం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం కాదని, ఎన్నికల కమిషన్ పరిధి దాటి వ్యవహరించిందని వివరించారు. వాస్తవానికి ఏ అభ్యర్థి కూడా పిటిషనర్‌పై ఫిర్యాదు చేయలేదని తెలిపారు. అనంతరం ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్. అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. కమిషన్ తన ముందున్న ఆధారాలను బట్టే జోగి రమేశ్‌కు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
జిల్లా ఎన్నికల యంత్రాంగం నుంచి క్లీన్‌చిట్ వస్తే, కమిషన్ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుం టుందని కోర్టుకు నివేదించారు. అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేస్తూ.. పిటిషనర్ ఎమ్మెల్యే కాబట్టి, ఆయన కొన్ని ప్రజా సంబంధిత బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుం దన్నారు. అందువల్ల సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పార్టీ విధానాలు, విజయాల గురించి మాట్లాడుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో మాట్లాడానికి వీల్లేదని, ఓటర్లను ఏ రకంగానూ ప్రభావితం చేయరాదని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు.