సాక్షి, అమరావతి: హోంగార్డుల విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హోంగార్డులు నిర్వర్తించే విధులు ‘సివిల్ పోస్టు’ కిందకే వస్తాయని, అందువల్ల వారిని ఎలా పడితే అలా సర్వీసు నుంచి తొలగించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని అధికరణ 311(2) ప్రకారం తగిన విచారణ జరపకుండా హోంగార్డులను శిక్షించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అంతేగాక హోంగార్డుల చేరిక, వారు అందించే సేవలు స్వచ్ఛందం(వాలంటరీ) అంటూ ప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చింది. ఎవరు పడితే వారు హోంగార్డుగా చేరడానికి కుదరదని, ప్రభుత్వం కొన్ని అర్హతలను, ప్రమాణాలను నిర్దేశించి, అర్హులను మాత్రమే హోంగార్డులుగా ఎంపిక చేస్తుందని, అందువల్ల వారి సేవలను స్వచ్ఛందమని చెప్పజాలమని తెలిపింది. అలాగే హోంగార్డులకు ఏపీ పోలీస్ మాన్యువల్ చాప్టర్ 52 వర్తించదని స్పష్టం చేసింది. ఏపీ హోంగార్డుల చట్ట నిబంధనలే వర్తిస్తాయంది.
పలు కేసుల్లో నిందితులుగా ఉండి నిర్దోషులుగా బయటకు వచ్చిన హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ఇది వారి జీవించే హక్కును హరించడమే అవుతుందని స్పష్టం చేసింది. హోంగార్డులను సర్వీసు నుంచి తొలగించే అధికారం కమాండెంట్‌కే ఉంటుంది తప్ప, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ఉండదని తెలిపింది. వివిధ కారణాలతో పలువురు హోంగార్డులను సర్వీసు నుంచి తొలగిస్తూ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు జారీ చేసిన వేర్వేరు ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది. హోంగార్డుల చట్టం, దాని నిబంధనలను అనుసరించి తగిన ఉత్తర్వులు జారీ చేసే స్వేచ్ఛను ఆయా కమాండెంట్‌లకు ఇచ్చింది. హోంగార్డులుగా తొలగించిన పిటిషనర్లందరినీ విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. పలు ఆరోపణలతో తమను సర్వీసు నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు సవాలు చేస్తూ పలువురు హోంగార్డులు 2019, 20, 21 సంవత్సరాల్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపిన జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇటీవల ఉమ్మడి తీర్పు వెలువరించారు. ‘‘మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత మద్రాసు హోంగార్డుల చట్టాన్ని మనం అన్వయింప చేసుకున్నాం.
అందువల్ల హోంగార్డుల సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ చర్యలు తదితరాలన్నీ కూడా 1948లో తీసుకొచ్చిన ఏపీ హోంగార్డుల చట్ట నిబంధనలకు లోబడి ఉంటాయి. అయితే ప్రభుత్వం ఈ నిబంధనలేవీ హోంగార్డులకు వర్తించవని చెబుతోంది. ఏపీ పోలీస్ మాన్యువల్‌లోని చాప్టర్ 52 ప్రకారం హోంగార్డులు నడుచుకోవాల్సి ఉంటుందని వాదిస్తోంది. వాస్తవానికి హోంగార్డులు పోలీసుల నియంత్రణలో పనిచేస్తున్నప్పటికీ, వాళ్లు పోలీసు విభాగంలో భాగం కాదు. హోంగార్డులది ప్రత్యేక వ్యవస్థ. వారి ఎంపికకు ప్రత్యేక అర్హతలు, నిబంధనలున్నాయి. ఏపీ హోంగార్డుల చట్టాన్ని అనుసరించి పోలీసు మాన్యువల్ నిబంధనలను రూపొందించలేదు. అందువల్ల హోంగార్డులకు పోలీసు మాన్యువల్ వర్తించదు’ అని తన తీర్పులో పేర్కొన్నారు.
హోంగార్డులవి సివిల్ పోస్టులే
Published Thu, Apr 15 2021 4:57 AM | Last Updated on Thu, Apr 15 2021 4:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment