
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోళ్ల అక్రమాల వ్యవహారంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏబీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. ఒకవేళ ఏబీ విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సివస్తే ఆర్నేష్‌కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించారు. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో తనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఆయన ఆగస్టు 7న హైకోర్టులో పిటిషన్ వేశారు.
కుమారుడికి కాంట్రాక్టు కట్టబెట్టారు: అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్
► నిఘా పరికరాల కొనుగోళ్లలో ఏబీ వెంకటేశ్వరరావు స్వీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ కాంట్రాక్టును ఏబీ తన కుమారుడికి కట్టబెట్టి లబ్ధి చేకూర్చారు. ఈ విషయాన్ని ఆయన ఎక్కడా బహిర్గతం చేయలేదు. సీనియర్ అధికారులు వారిస్తున్నా వినకుండా నిఘా పరికరాల కొనుగోళ్ల విషయంలో ముందుకెళ్లారు.
► ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక కూడా నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. కేవలం ఆందోళన ఆధారంగానే ఏబీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇలాంటి వ్యాజ్యాలకు విచారణార్హత లేదని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో చెప్పింది.
► ఐపీఎస్ అధికారులపై ఏబీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ఐపీఎస్ అధికారులు తనపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏబీ ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఆయనే గతంలో ఇలా వ్యవహరించి ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా కేసు నమోదు చేస్తే మిగిలిన పౌరుల పట్ల ఏవిధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నామో, ఏబీ విషయంలోనూ అలాగే వ్యవహరిస్తాం.
► కేసు పెడితే దర్యాప్తును ప్రభావితం చేయబోమని ఏబీ చెబుతున్నారు. ఆయన కుమారుడు సాక్ష్యాలను ప్రభావితం చేశారనేందుకు ఆధారాలున్నాయి. సాక్ష్యాల తారుమారులో ఏబీ సమర్థత ఎలాంటిదో చూపే రికార్డులున్నాయి. కావాలంటే కోర్టు పరిశీలించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment