
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా, రంగంపేట మండలం, జి.దొంతమూరు గ్రామంలో కొందరు వ్యక్తులు లీజు పరిధులు దాటి చేస్తున్న అక్రమ మైనింగ్‌పై విచారణ జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణ నివేదికను తదుపరి విచారణ నాటికి కోర్టు ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా ప్రయోజనాలను, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని, మైనింగ్ కార్యకలాపాలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. జి.దొంతమూరు గ్రామంలోని పలు సర్వే నంబర్లలో లీజు పొందిన పరిధి 6.14 సెంట్ల భూమిని దాటి ఉయ్యూరి వీర్రాజు, 3.54 ఎకరాల భూమిని దాటి నెల్లిమర్ర శ్రీనివాసరావు చేస్తున్న మైనింగ్ కార్యకలాపాలను నిలిపేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. జి.దొంతమూరు గ్రామంలో ఉయ్యూరి వీర్రాజు, నెల్లిమర్ర శ్రీనివాసరావులు నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, లీజు పరిధి దాటి మైనింగ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎ.ప్రభాకరరావు వాదనలు వినిపిస్తూ, కంకర మైనింగ్ లీజు ఇవ్వొద్దని, దీని వల్ల రంగంపేట పరిధిలో పర్యావరణ సమస్యలు వస్తాయని వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదన్నారు. లీజుకు తీసుకున్న ప్రాంతాన్ని దాటి మిగిలిన చోట్ల వీర్రాజు, శ్రీనివాసరావులు కోట్ల రూపాయల విలువైన కంకరను తవ్వేస్తున్నారని, వీటిని ఆధారాలతో సహా అధికారులకు ఇచ్చినా లాభం లేకపోయిందని తెలిపారు. కనీసం ఎలాంటి తనిఖీలు కూడా చేయలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, కోర్టు ముందున్న ఆధారాలను బట్టి చూస్తే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల్లో కొంత బలం ఉందని ఈ న్యాయస్థానం ప్రాథమిక అభిప్రాయానికి వచ్చిందన్నారు. అలాగే మైనింగ్ లీజు పరిధి దాటి వీర్రాజు, శ్రీనివాసరావులు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండటంపై విచారణ జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment