సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోయాయి. నవయుగ పోర్టు లిమిటెడ్‌తో ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఒప్పందం రద్దును ప్రశ్నిస్తూ నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం కొట్టేసింది. ఒప్పందం ప్రకారం చేపట్టాల్సిన బాధ్యతలను నిర్వర్తించడంలో నవయుగ విఫలమైందని తేల్చిచెప్పింది. ఒప్పందంలోని బాధ్యతలను నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయడం సబబేనని పేర్కొంది. మొత్తం 5,342 ఎకరాల భూమిని ఒకేసారి అప్పగిస్తేనే ప్రాజెక్టు పనులు చేపడతామని నవయుగ చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
ఇది ఆ కంపెనీ పెట్టిన కొత్త ఏకపక్ష నిబంధన అని ఆక్షేపించింది. ఒప్పందంలో ఎక్కడా భూమిని ఒకేసారి ప్రారంభంలోనే ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. సముద్రానికి పక్కన ఉన్న 2,601 ఎకరాల భూమిని ఇస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను నవయుగ తిరస్కరించిందని పేర్కొంది. తమకు ఒకేసారి 5,342 ఎకరాలను ఇవ్వాలని పట్టుబట్టిందని తెలిపింది. మొత్తం 5,342 ఎకరాల భూమిని అప్పగిస్తే తప్ప, నిధుల లభ్యతను సాధించేందుకు.. పోర్టు అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆ కంపెనీ చెప్పిందంది.
తద్వారా పోర్టు అభివృద్ధి కోసం కుదుర్చుకున్న ఒప్పందంలోని బాధ్యతలను నిర్వర్తించడానికి నవయుగ నిరాకరించినట్లైందని స్పష్టం చేసింది. 2018 మార్చి కల్లా నిధుల లభ్యతను సాధించడంలోనూ ఆ కంపెనీ విఫలమైందని వెల్లడించింది. దీంతో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేస్తూ జీవో 66 జారీ చేసిందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు గురువారం తీర్పు వెలువరించారు.
ఇదీ నేపథ్యం..
మచిలీపట్నం పోర్టుకు సంబంధించి పదకొండున్నరేళ్ల క్రితం నవయుగ పోర్టు లిమిటెడ్ నాటి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాథమికంగా ప్రభుత్వం 412 ఎకరాల భూమిని అప్పగించింది. ఆ తర్వాత 2,601 ఎకరాల భూమిని అప్పగిస్తామని ప్రతిపాదించినా నవయుగ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు. పోర్టు శంకుస్థాపన శిలాఫలకం తప్ప.. ఏ రకమైన పనులు చేపట్టలేదు. సవరణ ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించడం తప్ప ఇన్నేళ్లలో ఆ కంపెనీ చేసిందీ ఏమీ లేదు. ప్రతి విషయంలో మినహాయింపులు కోరడం తప్ప ఏమీ చేయలేదు.
ఒప్పందానికి అనుగుణంగా నడుచుకోకపోవడం, నిర్దేశిత కాల వ్యవధిలోపు పనులు ప్రారంభించకపోవడంతో నవయుగతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ 2019లో జీవో 66 జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ నవయుగ పోర్టు లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు జీవో అమలుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. టెండర్ల ప్రక్రియ కొనసాగించుకోవచ్చని, అయితే టెండర్లను ఖరారు చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment