సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసింది. పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఏపీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ఏకపక్షంగా ప్రకటించారని పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు షెడ్యూల్ అవరోధం అవుతుందని, ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్ రద్దు చేస్తున్నామని, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాల్సిందే.. ప్రజలకున్న హక్కులను కాలరాయలేమని ప్రకటించింది. ప్రభుత్వ వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తూ.. ప్రభుత్వం సూచనలను ఎస్‌ఈసీ పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అంతకు క్రితం అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు... ‘‘ ఎస్‌ఈసీ నిర్ణయాలన్నీ ఉద్దేశ పూర్వకమైనవి. ఎస్‌ఈసీ తనకు తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం సూచనలను ఏ మాత్రం పట్టించుకోలేదు. 2020 మార్చిలో వాయిదా వేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వదిలేసి.. పంచాయతీ ఎన్నికలు ప్రారంభించడంలోనే ఎస్‌ఈసీ ధోరణేంటో స్పష్టమౌతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేయాలి. ప్రభుత్వంలోని పెద్దలపై ఎస్‌ఈసీ నిరంతరాయంగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తోంది. ఒక రాజకీయ పార్టీ ప్రస్తుతమున్న ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటోంది. ఆ పార్టీ కోరుకుంటుందనే ఎస్‌ఈసీ వెంటనే ఎన్నికలు జరపాలని చూస్తోంది. వ్యాక్సినేషన్ కోసం ఏ స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుందో.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఊహించలేకపోతుంది. ప్రజారోగ్యం కాపాడేందుకు పెద్దఎత్తున ప్రభుత్వ విభాగాలు, ఉద్యోగులను.. మొహరించాల్సి ఉంటుందనే విషయాన్ని ఎస్ఈసీ విస్మరిస్తుంది. నిజాయితీగా, సహేతుకంగా విధులు నిర్వహించడమనేది ఎస్‌ఈసీకి వర్తిస్తుంద’’ని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment