Jagananna Amma Vodi: ‘అమ్మ ఒడి’ పిలిచింది | AP Labor Workers who migrated to Telangana Praising CM Jagan for Amma Vodi Scheme | Sakshi
Sakshi News home page

Jagananna Amma Vodi: ‘అమ్మ ఒడి’ పిలిచింది

Published Sun, Mar 28 2021 3:31 AM | Last Updated on Sun, Mar 28 2021 10:51 AM

AP Labor Workers who migrated to Telangana Praising CM Jagan for Amma Vodi Scheme - Sakshi

సాక్షి, కామారెడ్డి (తెలంగాణ): కొన్నేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని తెలంగాణకు వలస వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తాపీ మేస్త్రీలు, కూలీలు, కార్మికులను ‘అమ్మ ఒడి’ పథకం ఆకర్షిస్తోంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగ అభివృద్ధికి తీసుకున్న విప్లవాత్మక చర్యలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారి పిల్లలను సొంతూరిలో చదివించేలా చేస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వైఎస్సార్, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన తాపీ మేస్త్రీలు, సెంట్రింగ్‌ వర్కర్లు, కూలీలు, ఇతర వృత్తులకు చెందిన వేలాది కుటుంబాలు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్నాయి. చాలా మంది భార్య, పిల్లలతో కలసి అద్దె ఇళ్లల్లో ఉంటూ పనులు చేసుకుని బతుకుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వీరు ఇంత కాలం తాము పని చేస్తున్న చోట పిల్లలను ప్రైవేటు బడుల్లో చేర్పించి, రూ.వేలల్లో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చింది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కార్పొరేట్‌ విద్యా సంస్థలను తలదన్నే రీతిలో బడులను తీర్చిదిద్దింది. దీనికి తోడు పిల్లలను బడికి పంపితే ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది మేస్త్రీలు, కూలీలు తమ పిల్లలను సొంతూళ్లకు తీసుకెళ్లి అక్కడి బడుల్లో చేర్పించారు. ఒక్క కామారెడ్డి ప్రాంతంలోనే దాదాపు 180 మంది మేస్త్రీలు, వర్కర్లు తమ పిల్లల్ని సొంతూళ్లలో చేర్పించారు. నానమ్మ దగ్గరో, అమ్మమ్మ దగ్గరో వాళ్లను ఉంచి బడులకు పంపుతున్నారు. 

ఫీజులు కట్టే భారం తగ్గింది
మాది ప్రకాశం జిల్లా పనులూరు మండలం యాంపాడు గ్రామం. నేను, నా భార్య శ్యామల, పిల్లలతో కలసి కామారెడ్డిలో ఉంటున్నాం. నా కొడుకు బన్నీ ఇప్పుడు ఏడో తరగతి చదువుతున్నాడు. కామారెడ్డిలో ప్రైవేటు బడిలో చదివించాను. ఏడాదికి రూ.16 వేల నుంచి రూ.18 వేల ఫీజు కట్టాను. మా దగ్గర సీఎం జగన్‌ అమ్మ ఒడి పథకం తీసుకురావడంతో పాటు అక్కడ స్కూళ్లల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో నా కొడుకును వెంగళాపూరం స్కూల్లో చేర్పించాను. వాళ్ల అమ్మమ్మ ఇంట్లో ఉండి రోజూ వెళ్లి వస్తున్నాడు. అమ్మ ఒడి ద్వారా రూ.15 వేలు నా భార్య ఖాతాలో జమ అయ్యాయి. ప్రైవేటులో ఫీజులు కట్టే భారం తగ్గింది. సీఎం జగన్‌ చేసిన మేలు మరిచిపోలేం.
  – గడిపూడి బ్రహ్మయ్య, తాపీ మేస్త్రి, కామారెడ్డి

ఇద్దరు కూతుళ్లను చేర్పించా
మాది ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం గరుగుపాలెం గ్రామం. పిల్లల చదువులకు ఇక్కడ వేలకు వేలు ఖర్చయ్యేవి. ఏపీ సీఎం జగన్‌ అమ్మ ఒడి పథకం తీసుకువచ్చిన తర్వాత నా ఇద్దరు కూతుళ్లు మాలశ్రీ, మాధురిలను లింగసముద్రంలోని హాస్టల్‌లో చేర్పించాను. పిల్లలిద్దరు బాగా చదువుతున్నారు. ఏడాదికి రూ.15 వేలు అమ్మ ఒడి కింద ఇస్తున్నారు. పండుగల సమయంలో ఇంటికి వెళ్లినపుడు పిల్లలను కలిసి వస్తున్నాం. సీఎం జగన్‌ చేస్తున్న సాయం ఎంతో ఉపయోగపడుతోంది.   
 – బుగ్గవరపు కొండయ్య, తాపీ మేస్త్రి, కామారెడ్డి

చదువు విషయంలో మంచి నిర్ణయాలు 
మాది ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం గంగపాలెం గ్రామం. నేను, నా భార్య వెంకాయమ్మ, పిల్లలతో కలసి కామారెడ్డిలో ఉంటున్నాం. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ స్కూళ్లల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో మా కొడుకు చంద్రమాధవ్‌ను తిమ్మారెడ్డిపాలెంలోని మోడల్‌ స్కూల్‌లో చేర్పించాను. చదువు చాలా బాగా చెబుతున్నారు. ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. ఇక్కడ చదివిస్తే అధికంగా ఫీజులు కట్టాల్సి వచ్చేది. సీఎం జగన్‌ చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 
 – దేవూరి వెంకట్రావ్, తాపీ మేస్త్రి, కామారెడ్డి

చదువు బాగా చెబుతున్నారు
మాది ప్రకాశం జిల్లా లింగారెడ్డిపల్లి. నేను.. నా భార్య, కొడుకు, కూతురుతో కలసి కామారెడ్డిలో ఉంటున్నా. ఇక్కడ ప్రైవేటు బడిలో చదివించడానికి డబ్బు బాగా ఖర్చయ్యేది. ఏపీలో అమ్మ ఒడి పథకం తీసుకువచ్చిన తర్వాత అక్కడ స్కూళ్లు మెరుగయ్యాయని తెలిసి నా కొడుకు నవదీప్‌ను తీసుకువెళ్లి మా ఊరి స్కూల్లో 2వ తరగతిలో చేర్పించా. మా అమ్మా, నాన్న దగ్గర ఉంటున్నాడు. మొన్న అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి. ప్రభుత్వ స్కూల్‌ అయినా చదువు బాగానే చెబుతున్నారు.   
 – సీలం లక్ష్మీనారాయణ, సెంట్రింగ్‌ మేస్త్రి, కామారెడ్డి

స్కూళ్లు బాగు చేసి మేలు చేశారు
మాది ప్రకాశం జిల్లా మండాదివారిపల్లి గ్రామం. నేను, నా భార్య సుధాహాసిని, పాప వైష్ణవితో కలసి కామారెడ్డిలో ఉంటున్నాం. మా పాపను ఇక్కడ ప్రైవేటు స్కూల్లో  చదివించాను. ఏడాదికి రూ.15 వేలకు పైగా ఖర్చయ్యేవి. ఏపీలో సీఎం జగన్‌ స్కూళ్లు బాగు చేశారు. అమ్మ ఒడి కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నారని తెలియగానే మా పాపను వాళ్ల అమ్మమ్మ ఊరు కంచర్లవారిపల్లిలోని ప్రభుత్వ బడిలో చేర్పించాను. ఇప్పుడు నాలుగో తరగతి చదువుతోంది. రూ.15 వేలు అమ్మ ఒడి డబ్బులు నా భార్య ఖాతాలో జమ అయ్యాయి. 
 – పాలకొల్లు చిన్న వెంకటేశ్వర్లు, సెంట్రింగ్‌ మేస్త్రి, కామారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement