
తాడేపల్లి : ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబేమీ యుగపురుషుడు కాదని, చేసిన తప్పును ఒప్పుకుని పొరపాటయిందని చెప్పి చెంపలకు వేసుకోవాల్సింది పోయి జనాన్ని రెచ్చగొట్టడమేంటని ప్రశ్నించారు.
అమరావతి పేరుతో అక్రమాలు..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుని రిమాండుకు తరలించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని అమరావతిలో రాజధాని నిర్మిస్తానని చెప్పి బడుగు, బలహీన వర్గాల వారి నుండి భూములు దోచుకున్నారన్నారు. తాత్కాలిక నిర్మాణాల పేరుతో కట్టిన టిట్కో ఇళ్ల దగ్గర్నుంచి సెక్రటేరియట్ వరకు అన్నిటిలోనూ దోపిడీ చేశారని తెలిపారు.
రాజధాని భూముల్లోనూ..
ఈ స్కాంలో కొనుగోలు చేసిన తమ భూముల పక్కనుండి రింగ్ రోడ్ వెళ్లేలా ప్లాన్ రూపొందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ప్రతిదానిలోనూ అవినీతికి పాల్పడ్డారని దోపిడీ చేసిన దొంగ జైలుకు పోతే బంద్‌కు పిలుపు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. తాను నిజంగా తప్పు చేయకపోతే మమ్మల్ని విమర్శించడం కాదు చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.
తప్పుడు రాతలు..
ఇక ఎల్లో మీడియా ఇన్నాళ్లు తప్పుడు కథనాలతో చంద్రబాబుకు కొమ్ము కాసి ప్రజలను తప్పుదోవ పట్టించిందని వోక్స్ వ్యాగన్ విషయంలో నాపై ఈనాడు పత్రిక అనేక కథనాలను రాసిందన్నారు. ఇకపై రామోజీరావు పప్పులు ఉడకవని అన్నారు.
తప్పు మీరు చేసి..
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో భారీగా అవినీతి జరిగిందని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలు చేశారని అన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు కనుసన్నల్లోనే కుంభకోణం జరిగిందని ఇప్పు మాత్రం ఏమీ తెలియదన్నట్లు అది క్యాబినెట్ నిర్ణయమని చెప్పి తప్పించుకోవాలని చూస్తే కుదరదన్నారు. బాధ్యతగల పదవిలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా దోపిడీ జరిగిందో లేదో చూసుకోవాలి కదా అని ప్రశ్నించారు.
లెక్కలు చెప్పాలి..
తాము అధికారంలో ఉన్నప్పుడు అనేక స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పే టీడీపీ నేతలు అసలు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారో లెక్క చెప్పాలని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో నివేదించాలని కోరారు. ఈ వాస్తవాలను ప్రజలకు తెలియజేయకుండా తానేదో యుగపురుషుడిని అన్నట్టు చంద్రబాబు మాట్లాడితే ఎలాగని ప్రశ్నిస్తూనే చంద్రబాబు దోపిడీ చేసి దొరికిపోయిన దొంగని అన్నారు.
చెంపలు వేసుకోవాల్సింది పోయి..
ఇలా గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఇద్దరు ముగ్గురు సీఎంలు, మంత్రులు కూడా జైలుకు పోయారని వారికంటే చంద్రబాబు ఏమీ గొప్పవాడు కాదని అన్నారు. ఇంత పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడి చేసిన తప్పుకు పశ్చాత్తాప పడి చెంపలు వేసుకోవడం మానేసి ధర్నాలు చేయండి, బందులు చేయండని జనాన్ని పిలుపునిస్తారా అని ప్రశ్నించారు.
మీ తప్పుకు ప్రజలెందుకు ఇబ్బంది పడాలి..
భారీ కుంభకోణాలకు పాల్పడింది మీరు. దోపిడీలు చేసింది మీరు.. మీరు అక్రమాలు చేసి జైలుకు పోతే జనం బందులు చేయాలా? ఇదెక్కడి న్యాయామని ప్రశ్నించారు. ఏపీ ఫైబర్ నెట్, టిట్కో ఇళ్లలో ఎంత అవినీతి జరిగిందో కూడా పూర్తిగా విచారణ చేయాలి. టిట్కో ఇళ్లలో అడుగుకి 11 వేలు తీసుకుని నిర్మాణం చేయటం దోపిడీ కాక మరేమిటని ప్రశ్నించారు.
తుట్ట కదిలింది..
సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు చేసిన అవినీతి తుట్ట ఇప్పుడు కదులుతోందని ప్రస్తుతానికైతే అరెస్టయి జైలుకు వెళ్లారని చట్టాలను గౌరవించాలన్నారు. అలా కాకుండా చట్టాన్ని చేతులోకి తీసుకోవాలని చూస్తే ప్రభుత్వం ఊరుకోదని వచ్చే ఉగాది నాటికి టీడీపీ ఉండదని నేను ఎప్పుడో చెప్పానని గుర్తుచేశారు. ఇంతదారుణమైన అవినీతి పార్టీకి ప్రజల మద్దతు ఉండదనే నేను ఆరోజే చెప్పాను
ఈ కేసు ఇప్పటిది కాదు..
అవినీతిలో చంద్రబాబు పీకల్లోతు కూరుకుపోయారని నా ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో టీడీపీ లాంటి అవినీతి పార్టీని నేను చూడలేదన్నారు. చంద్రబాబుకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదా? వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకుంటూ స్టేలు తెచ్చుకుని బతికినప్పుడు కోర్టులు మంచిగా కనిపించాయా అని నిలదీశారు. కోర్టులో దోషిగా తేలిన తర్వాత సీఐడీ మాకు జేబు సంస్థ అనటం ఏంటని ప్రశ్నించి రింగ్ రోడ్ కేసు ఇప్పుడు పెట్టింది కాదుకదా అని గుర్తు చేశారు.
చంద్రబాబే సూత్రధారి..
చంద్రబాబు మీద ఉన్న కేసులన్నీ విచారణ దశలోనే ఉన్నాయన్నారు. వాటిపై లోతైన విచారణ చేస్తున్నామని స్కిల్ కేసులో పూర్తిగా విచారణ జరపటం వలనే చంద్రబాబు ఏ1 అయ్యారని తెలిపారు. స్కిల్ స్కాంకి సూత్రధారి చంద్రబాబేనని తేలింది. అవినీతిపరుడని చంద్రబాబుకు మద్దతిస్తున్న పవన్ కళ్యాణ్ సిగ్గుతో తలవంచుకుని ఇంట్లో కూర్చోవాలని చంద్రబాబు తప్పు చేయలేదని అవినీతికి పాల్పడలేదని పవన్ చెప్పగలడా అని ప్రశ్నించారు.
ఆ కేసులు వేరు.. ఈ కేసులు వేరు
పవన్ కళ్యాణ్ విధానాలేంటో ఎప్పటికీ అర్ధం కావని అసలు పవన్ రాజకీయ నాయకుడేనా? అదొక రాజకీయ పార్టీనా? ఆపార్టీకి సిద్దాంతాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. జగన్ కేసులు వేరు, చంద్రబాబు కేసులు వేరని జగన్ పై కేసులు నమోదైనప్పుడు అయన వ్యవస్థలో లేరని ఇక్కడ చంద్రబాబు ఆయనే సంతకాలు పెట్టి అవినీతి చేశారన్నారు.
ఎప్పుడో జరగాలి..
వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అన్ని కేసుల్లోనూ స్టే తెచ్చుకోవడం వల్లనే ఇంతకాలం ఆగాయని లేకపోతే చంద్రబాబు ఎప్పుడో అరెస్టు అయ్యేవారన్నారు. మాకు వ్యక్తిగతంగా ఎవరిమీదా కోపం లేదు. తప్పు చేసిన వారెవరైనా చట్టానికి తల వంచాల్సిందే తప్పదన్నారు. ఎవరు ఎంత మ్యానిప్యులేట్ చేసినా అంతిమంగా న్యాయం, ధర్మానిదే విజయమని అన్నారు.
ఇది కూడా చదవండి: స్కిల్ నుంచి సంక్రాంతి బెల్లం వరకూ అంతా స్కామే
Comments
Please login to add a commentAdd a comment