మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జిల్లా శోక సంద్రంలో మునిగిపోయింది. మృధుస్వభావి, మానవతావాది, స్నేహశీలి, వివాదారహితుడిగా అందరి ఆత్మబంధువయ్యారు. దశాబ్ద కాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయాల్లో విభిన్నమైన వ్యక్తిగా బలమైన నేతగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా తన రాజకీయ ప్రస్థానంలో సామాన్యుడి నుంచి కార్పొరేట్ల వరకు అందరి వాడయ్యారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రిగా జిల్లా అభివృద్ధిలోనే కాకుండా రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అజాత శత్రువు అంతలోనే దిగంతాల్లో ఒరిగిపోయారు.
సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (50) అకాల మరణంతో సింహపురి కన్నీటి సంద్రమైంది. జిల్లా ప్రజలు కఠోర నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండుమార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండో దఫాలో కీలకమైన రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి పదవిని చేపట్టారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండే అరుదైన నేతగా ముద్ర వేసుకున్నారు. అందరిని ఆత్మీయంగా పలకరించే గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతి వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
2013లో ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డి (ఫైల్)
రాజకీయ అరంగ్రేటం
నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పెద్ద కుమారుడు గౌతమ్‌రెడ్డి. మాంచెస్టర్‌లో ఎమ్మెస్సీ టెక్స్‌టైల్స్ పూర్తిచేసి వ్యాపార రంగంలో బిజీగా ఉండేవారు. తన తండ్రి ఒంగోలు, నరసారావుపేట, నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన సమయంలో మాత్రమే ప్రచార బాధ్యతలు నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు 2013లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగ్రేటం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలతో ప్రత్యక్ష పరిచయంతో పాటు నియోజకవర్గ సమస్యలపై అవగాహన కల్పించేకునేందుకు పాదయాత్ర చేపట్టారు. గతంలో ఇలా పాదయాత్ర చేపట్టిన నాయకులే లేకపోవడంతో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గ్రామ గ్రామాన పాదయాత్రలో పలువురిని పేరు పేరున పలుకరిస్తూ వ్యక్తిగతంగా ప్రజలకు దగ్గరయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఆత్మకూరు నుంచి పోటీ చేసి 33 వేల పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే ప్రతిపక్ష శాసన సభ్యుడిగా ఐదేళ్ల పాటు ఆయన నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేందుకు తన సొంత నిధులు వెచ్చించారు. మరింత ప్రజాభిమాన నేతగా ఎదిగారు.
అభివృద్ధికి ప్రణాళికలు
2019లో జరిగిన ఎన్నికల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుండే రెండో దఫా 22,500 మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆ వెంటనే రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, చేనేత, జౌళి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కీలకమైన శాఖలకు మంత్రిగా ఆ శాఖల ప్రగతికి అహర్నిశలు శ్రమిస్తూనే.. మరో వైపు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మెట్ట ప్రాంతం ఆత్మకూరు నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధికి పునాదులు వేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు పలుమార్లు ఆత్మకూరులోనే జాబ్ మేళాలు నిర్వహించారు. ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించారు. ఆత్మకూరును పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నారంపేట వద్ద ఎంఎస్‌ఎంవీ పార్కు నెలకొల్పారు. ఇక్కడ పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు.
సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తూ..
ఆత్మకూరు నియోజకవర్గంలోనే జలనిధి ఉన్నప్పటికీ రైతుల సాగునీటి వెతలను పాదయాత్ర గుర్తించారు. తాగునీటికి పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. ఆనాడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ చివరి ఆయకట్టు రైతులకు నీరందేలా చూడాలని పలుమార్లు జలవనరుల శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించి అమలు చేశారు. గతానికి భిన్నంగా డెల్టాతో సమానంగా సోమశిల జలాలు మెట్ట ప్రాంతాలకు అందేలా చర్యలు చేపట్టారు. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న సోమశిల ఉత్తర కాలువ హైలెవల్ కెనాల్ పనుల్లో అభివృద్ధి సాధించేలా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి వేగంగా పనులు జరిగేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫేజ్–1, ఫేజ్–2 పనులు వేగవంతమయ్యేలా కృషి చేశారు. ఎంజీఆర్ స్వజల్ పథకం ఏర్పాటు చేయించి స్వచ్ఛమైన తాగునీటిని తక్కువ ధరకే మున్సిపల్ ప్రజలకు అందేలా పథకానికి శ్రీకారం చుట్టి, ఆరు నెలలకే ప్రజలకు అందుబాటులో వచ్చేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
ప్రజలకు అందుబాటులో..
రాష్ట్ర కీలక శాఖల మంత్రిగా అనునిత్యం బిజీగా ఉండే మేకపాటి గౌతమ్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఎంజీర్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆ నంబరుకు సమస్యలు ఉన్న వారు ఫోన్‌లో చెబితే వాటి పరిష్కారానికి కృషి చేసేలా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఎన్నో సమస్యలను పరిష్కరించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం ఎక్కువ రోజులు దేశ, విదేశాల్లో పర్యటనలు చేస్తూనే.. నియోజకవర్గ అభివృద్ధి, పాలనలో ఎక్కడా లోపం లేకుండా చూశారు. ఎక్కడ ఉన్న ప్రతి నెలలో అన్ని మండలాల అధికారులు, ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించే వారు. సమస్యల పరిష్కారం, అభివృద్ధికి సూచనలు చేస్తూ, అందుకు అవసరమైన నిధులు సమకూర్చుతుండే వారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 228 మందికి రూ.1.92 కోట్ల సహాయాన్నిఅందించడంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన వంతు కృషి చేశారు. ఇదే కాక ఎందరికో వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేసిన మంచి వ్యక్తి గౌతమ్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment