జీవితంలో ఊహించనన్ని మలుపులు సినిమాలో కనిపిస్తాయి కానీ.. అందుకు సాక్షాత్తు నిదర్శనం విడదల రజని. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాదు.. అందుకు తగ్గట్టుగా రాణించడం, తనకు తానుగా నాయకురాలిగా ఎదగడం, ప్రతీ సవాలును ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లో నాయకురాలిగా నిలబడడం లాంటి ఎన్నో ఘటనలు విడదల రజనీ జీవితంలో కనిపిస్తాయి. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలవడమే ఒక సంచలనం అయితే... 32 ఏళ్లకే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం విడదల రజనీ జీవితంలో మరో విశేషం. అతి తక్కువ కాలంలో ప్రజల్లో మంచి అభిమానం సంపాదించుకున్న విడదల రజనీకి సోషల్ మీడియాలో లక్షలాది అభిమానులున్నారు.
నేపథ్యం
హైదరాబాద్‌లో 24-06-1990న పుట్టిన విడదల రజనీ.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాదు మల్కాజ్‌గిరి లోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో రజనీ 2011లో బి.ఎస్.సి. పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్లు పనిచేసిన రజనీ... విడదల కుమారస్వామితో వివాహం జరిగింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రజనీకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప.
అమెరికా జీవితం
భర్త కుమారస్వామితో కలిసి సాఫ్ట్‌వేర్‌లో పని చేసిన విడదల రజనీ.. మెరుగైన అవకాశాల కోసం భారతీయ యువతలాగే అమెరికా బాట పట్టారు. భర్తతో కలిసి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్‌వేర్ మల్టీ నేషనల్ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ ఏర్పాటు చేశారు. దీనికి కొన్నాళ్ల పాటు డైరెక్టర్, బోర్డు మెంబర్‌గా సేవలు అందించారు.
సమాజసేవ కోసం ఏపీకి తిరుగు పయనం
కొన్నాళ్లు అమెరికాలో ఉండి ఏపీకి తిరిగి వచ్చిన విడదల రజనీ.. 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. సొంత మనుషులు, సొంత గ్రామానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో వీఆర్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. 2018వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి, అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పై 8301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిచిన తొట్ట తొలి బీసీ మహిళగా చరిత్ర సృష్టించారు. శాసనసభ వేదికగా.. తనదైన శైలిలో వివిధ ప్రజా ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై గళం విప్పారు రజనీ. ఉత్సాహంగా ఉండడం, నిత్యం ప్రజల్లో ఉండడం, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండడం రజనీకి కలిసొచ్చిన అంశాలు.
Comments
Please login to add a commentAdd a comment