
సాక్షి, అమరావతి: మమ్మల్ని చంపి మా శవాలపై ఎన్నికలు నిర్వహిస్తారా? అంటూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్‌ను ప్రశ్నించారు. అద్దం చాటు నుంచి దాక్కుని మీడియా సమావేశం పెట్టి తన ప్రాణం ఎంతో విలువైందని, తానొక్కడినే సురక్షితంగా ఉండాలని చూపించారని, ఉద్యోగుల ప్రాణాలు మాత్రం అంత చులకనా? అని నిలదీశారు. విజయవాడలోని ఎన్జీవో హోమ్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమకూ కుటుంబాలున్నాయని, తమ ప్రాణాలకు బాధ్యత ఎవరిదని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దం చాటు నుంచి మీరు మాట్లాడినట్టుగా ఉద్యోగులు ఎన్నికల్లో ఎలా పని చేయగలరో చెప్పాలన్నారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసిన తీరు బాధ కలిగించిందని, ఎన్నికలకు ఇది సమయం కాదు.. ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ఇచ్చాక ఎన్నికలు నిర్వహించాలని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు.
నోటిఫికేషన్ ఇస్తూ ఎన్నికలకు సహకరించకపోతే దుష్పరిణామాలు ఉంటాయని ఉద్యోగుల్ని భయపెట్టడం ఏమిటని, ఎంతమంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తారు? ఎంతమందిని తొలగిస్తారు? అని నిలదీశారు. ఉద్యోగుల ప్రాణాలు పోయినా పర్వాలేదు.. ఎన్నికలు మాత్రం జరపాలని అనుకోవడం ఏమిటన్నారు. కరోనా సమయంలో అందరూ ఇళ్లలో ఉన్నా ఉద్యోగులు ప్రాణాలకు తెగించి పనిచేసిన విషయం ఎన్నికల కమిషనర్‌కు గుర్తు లేదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం రెండున్నరేళ్ల నుంచి సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా, మీరు రిటైరయ్యే సమయంలో పంతం కోసం ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరికాదని తప్పుపట్టారు.
ఎన్నికలు, వ్యాక్సిన్ రెండు అవసరమే అని చెప్పిన హైకోర్టు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెబితే ఏకపక్షంగా నోటిఫికేషన్ విడుదల చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. వెంటనే నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో సోమవారం ఈ కేసు విచారణకు వస్తుందని, అప్పటివరకూ ఆగాలని కోరారు. సుప్రీంకోర్టులో ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికీ తమ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగుల్ని తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment