తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద అభిమానుల సందడి
సాక్షి, అమరావతి: పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయదుందుభి మోగించారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పూర్తి ఏకపక్షంగా వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ఆమోదముద్ర వేస్తూ గ్రామీణ ప్రజలు విస్పష్ట తీర్పు చెప్పారు. సీఎం జగన్ పాలన సాగిస్తున్న తీరు, అమలు చేస్తున్న సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలకు జనామోదం ఉందని భారీగా నమోదైన పోలింగ్ శాతం స్పష్టం చేస్తోంది. పార్టీ రహితంగా ఈ ఎన్నికలు జరుగుతుండగా.. పోలింగ్ ముగిసిన వెంటనే జరిగిన ఓట్ల లెక్కింపులో గ్రామాల్లో అధికార వైఎస్సార్ సీపీ అభిమానులు దాదాపు 82 శాతం స్థానాల్లో విజయం సాధించారు. ఆది నుంచీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటలు మాదిరిగా ఉండే గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలుపొందారు. టీడీపీ ఈ ఎన్నికల్లో చావుదెబ్బతింది.
టీడీపీ నేత యనమల స్వగ్రామం ఏవీ నగరంలో సర్పంచ్‌గా విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కొయ్యా జగదీశ్వరి ఆనందం
పార్టీ రహిత ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం మొదలు.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారితో అంటకాగి అంతులేని సహకారం పొందినా, ఎన్నికల్లో నెగ్గుకురాలేక చతికిల పడింది. కుయుక్తులతో గ్రామాల్లో కక్షల కుంపటి వెలిగించాలని టీడీపీ విశ్వప్రయత్నం చేయడాన్ని గమనించిన ప్రజలు.. ఓటుతో గట్టిగా కర్రుకాల్చి వాతపెట్టినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులతో పాటు ఆయా గ్రామాల్లోని 32,502 వార్డు పదవులకు జనవరి 23వ తేదీ గ్రామ పంచాయతీల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయగా.. ఏకగ్రీవాలుగా ముగిసినవి పోను మంగళవారం 2,723 సర్పంచ్ స్థానాలకు, 20,157 వార్డు పదవులకు పొలింగ్ జరిగింది. ఓట్లలెక్కింపు మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా సర్పంచ్ ఫలితం ఖరారు కాగానే, ఆయా గ్రామాల్లో ఉప సర్పంచ్‌ను ఎన్నుకున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద డప్పులు కొడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, రత్నాకర్, పద్మజ తదితరులు
ఓటర్లకు కరోనా జాగ్రత్తల కోసమే రూ.30 కోట్లు
పోలింగ్ ప్రక్రియలో పంచాయతీరాజ్ శాఖ పూర్తి స్థాయి కరోనా నియంత్రణ చర్యలు చేపట్టింది. ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా ఓటర్లు వచ్చి ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికలు జరిగే అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో కరోనా జాగ్రత్తలు చేపట్టారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను ముందుగా పోలింగ్ కేంద్రం వద్ద థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షించిన అనంతరమే క్యూలైన్‌లోకి అనుమతించారు. జ్వరం వంటి లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన వారిని ఆఖరి గంటలో వచ్చి ఓటు వేసేయాల్సిందిగా విజ్ఞపి చేశారు. అందుకు అనుగుణంగా స్థానిక పోలింగ్ సిబ్బంది ఓటర్లను చైతన్యం చేసి, ఓటింగ్‌లో పాల్గొనేలా చర్యలు చేపట్టారు.
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి ప్రత్యేకంగా పీపీఈ కిట్లు అందజేసి ఆఖరి గంటలో ఓటు వేసేందుకు అనుమతించారు. జర్వం లక్షణాలతో బాధపడే వారికి గ్లౌజులు వంటివి అందజేసి ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ సిబ్బంది, ఓటర్లకు కరోనా నియంత్రణ జాగ్రత్తలలో భాగంగా మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజుల కొనుగోలుకు గాను నాలుగు విడతల ఎన్నికలకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.30 కోట్ల నిధులు కేటాయించినట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఓటింగ్ శాతం పెరగడానికి దోహద పడ్డాయని అధికారులు చెప్పారు.
గంట వ్యవధిలోపే ఓట్ల లెక్కింపు..
గ్రామాల్లో పోలింగ్ ముగిసిన గంట వ్యవధి లోపే అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.30 గంటలకు పోలింగ్ ముగియగా, ఆ వెంటనే గ్రామ పంచాయతీల వారీగా వాటి పరిధిలో ఉండే పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను నిర్ణీత కౌంటింగ్ కేంద్రం వద్దకు తరలించి ఓట్ల లెక్కింపు చేపట్టారు. చిన్న గ్రామ పంచాయతీల్లోని కొన్నింటిలో సాయంత్రం ఐదు గంటలకు ఫలితాలు వెల్లడయ్యాయి.
7,052 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ
మంగళవారం 29,732 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగగా.. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన వాటిలో అధికారులు వెబ్ కాస్టింట్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూం నుంచి కమిషనర్ గిరిజా శంకర్ ఆయా కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్, కౌంటింగ్ తీరును నిరంతరం పర్యవేక్షించారు. జిల్లాల నుంచి కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారుల నుంచి వ్యక్తమయ్యే సందేహాలను నివృత్తి చేశారు. జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరును పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎప్పటికప్పుడు వాకబు చేశారు.
ఏకగ్రీవాల నుంచే ఏకపక్షం
తొలి విడత ఎన్నికల ప్రక్రియలో ఏకగ్రీవాలు మొదలు పోలింగ్ జరిగిన చోట ఫలితాల్లోనూ 82 శాతం మేర స్థానాలు వైఎస్సార్‌సీపీ అభిమానులే గెలుచుకున్నారు. తొలి విడత 3,249 గ్రామాల్లో ఎన్నికలు జరిగితే, 525 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అందులో 98 శాతం మేర అంటే 518 సర్పంచ్ పదవులు వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలిచినవే కావడం విశేషం. 2,723 గ్రామ సర్పించి పదవులకు ఎన్నికలు జరిగితే అందులో 90 శాతం మేర వైఎస్సార్‌సీపీ అభిమానులే విజయం సాధించారు. (నెల్లూరు జిల్లా వెలిచర్లలో సర్పం చ్ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదు).
81.41 శాతం పోలింగ్..
ప్రస్తుతం కరోనా భయం మధ్య కూడా తొలి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో 81.41 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు సమయం ఉన్నప్పటికీ, 700–1500 మధ్య ఓట్లు ఉండే గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటలకే ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉండే గ్రామాల్లో 1.30 గంటల కంతా పూర్తయిందని జిల్లాలో పోలింగ్ పర్యవేక్షణ అధికారులు వెల్లడించారు. మొత్తంగా.. మధ్యాహ్నం 12.30 గంటలకు 62 శాతం మేర ఓటింగ్ నమోదైంది. దాదాపు 29,732 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతుండగా, చాలా చోట్ల మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఓటు వేసేందుకు ఒకరిద్దరికి మించి రాలేదని తెలిసింది. వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలోని కొన్ని వార్డుల్లో మాత్రం నిర్ణీత 3.30 గంటల సమయంలో కూడా కొందరు ఓటర్ల లైన్‌లో ఉండడంతో వారందరూ ఓటు వేసేంత వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment