మధ్యాహ్నం 3:30
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఓటింగ్ ముగిసే సమయానికి శ్రీకాకుళం 78.81, విజయనగరం 85.60, విశాఖ 84.07, తూ.గో. 74.99, ప.గో. 79.03, కృష్ణా 79.29, గుంటూరు 76.74, ప్రకాశం 78.77, నెల్లూరు 73.20, చిత్తూరు 75.68, కర్నూలు 76.52, అనంతపురం 82.26, వైఎస్‌ఆర్ జిల్లాలో 80.68 శాతం పోలింగ్ నమోదైంది.
మధ్యాహ్నం. 1.30
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12:30 వరకు 66.60 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి..
► శ్రీకాకుళం- 62.07 శాతం
► విజయనగరం- 77.2 శాతం
► విశాఖపట్నం- 73.3 శాతం
► తూర్పు గోదావరి-64.04 శాతం
► పశ్చిమ గోదావరి- 63.29 శాతం
► కృష్ణా- 62.82 శాతం
► గుంటూరు- 62.87 శాతం
► ప్రకాశం- 61.79 శాతం
► నెల్లూరు- 61.62 శాతం
► చిత్తూరు- 66.62 శాతం
► కర్నూలు- 68.62 శాతం
► అనంతపురం- 71.65 శాతం
► వైఎస్‌ఆర్ - 69.93 శాతం
మధ్యాహ్నం. 1.00
వార్డు ఏజెంట్‌పై టీడీపీ నేతల దాడి
గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. వట్టిచెరుకూరు మండలంలోని ముట్లూరులో ఐదవ వార్డు ఏజెంట్ అన్నవరపు బాబురావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో ఏజెంట్ బాబురావుకు తీవ్రగాయాలు కాగా ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బాబు రావు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.
మధ్యాహ్నం. 12.00
పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ నేపథ్యంలో డీజీపీ గౌతం సవాంగ్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. కొత్తవలస ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పోలీసుల తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
► కృష్ణా: గన్నవరం బాలుర హైస్కూల్‌లోని 9వ వార్డులో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుత ఓటింగ్ సరళిని బట్టి మూడు విడతల ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతుందని అంచనా వేశారు.
ఉదయం. 11. 30
తూర్పు గోదావరి: అల్లవరం మండలం మొగలుమూరులో ఎంపీ చింతా అనురాధ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కృష్ణా: గన్నవరం బాలుర పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకుడు సుబ్రహ్మణ్యం పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. గత మూడు విడతల్లో 86 శాతం ఓట్లు పోలైనట్లు పేర్కొన్నారు. నాలుగో విడతలో కూడా అదే రీతిలో నమోదు అవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఉదయం 6.30 నుండి పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు ఓటు వేసేందుకు వస్తున్నారని చెప్పారు. కౌంటింగ్ సమయంలో అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ఉదయం. 11.00
తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శాతం ఉదయం 10:30 వరకు 41.55 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి..
► శ్రీకాకుళం- 36.84 శాతం
► విజయనగరం- 54.57 శాతం
► విశాఖపట్నం- 48.94 శాతం
► తూర్పుగోదావరి- 35.85 శాతం
► పశ్చిమ గోదావరి- 34.62 శాతం
► కృష్ణా- 36.47 శాతం
► గుంటూరు- 41.25 శాతం
► ప్రకాశం- 40.5 శాతం
► నెల్లూరు- 33.94 శాతం
► చిత్తూరు- 43.58 శాతం
► కర్నూలు- 15.42 శాతం
► అనంతపురం- 46.36 శాతం
► వైఎస్‌ఆర్ - 40.69 శాతం
ఉదయం. 10.20
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏపీలో కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
► శ్రీకాకుళం: ఎచ్చెర్ల రణస్థలం మండలం పాతర్లపల్లిలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
► కృష్ణా: గన్నవరం మండలంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సీపీ శ్రీనివాసులు పర్యటించారు. గన్నవరం హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌ను పరిశీలించారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పేర్కొన్నారు.
ఉదయం 9.30
రాష్ట్రవ్యాప్తంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8.30 గంటల వరకు 13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు..
► శ్రీకాకుళం- 12.5 శాతం
► విజయనగరం- 22.5 శాతం
► విశాఖపట్నం- 18.48 శాతం
► తూర్పుగోదావరి- 8.58 శాతం
► పశ్చిమగోదావరి- 14.12 శాతం
► కృష్ణా- 8.53 శాతం
► గుంటూరు-13.94 శాతం
► ప్రకాశం-9.13 శాతం
► నెల్లూరు-8.44 శాతం
► చిత్తూరు-12.4 శాతం
► వైఎస్‌ఆర్ కడప-9.35 శాతం
► కర్నూలు-15.4 శాతం
► అనంతపురం-15.40 శాతం
ఉదయం. 9.10
►నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నాలుగో విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ భారీ వర్షం కారణంగా మందకొడిగా సాగుతోంది.
►విశాఖపట్నం: పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెంలో టీడీపీ, వైస్సార్‌సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
ఉదయం. 8.30
► పంచాయతీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతోంది. అధిక సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో ఓటు వేయడానికి బారులు తీరారు.
►అనంతపురం: పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు హైఅలర్ట్ ప్రకటించారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్ధులకు పోలీసుల సాయం అందేలా ఆదేశాలు ఇచ్చారు. మండలానికో డీఎస్పీతో భద్రత పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు.
టీడీపీకి ఎదురుదెబ్బ
కృష్ణా: గంపలగూడెం మండలంలోని పెనుగొలను గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధిష్టానం తీరుపై మద్దతుదారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థి జ్యోతి ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికల్లో ఆర్థిక సాయం చేస్తామని తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వైఖరిని నిరసిస్తూ గ్రామ పార్టీ అధ్యక్షుడు కోటా హరిబాబు రాజీనామా చేశారు.
ఉదయం. 7.30
► పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ గ్రామాల్లో దాదాపుగా ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఫ్యాక్షన్, పాత కక్షల చరిత్ర ఉన్న గ్రామాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఎన్నికల బందోబస్తులో దాదాపు 48 వేల మంది పోలీసులు పాల్గొన్నారు.
► శ్రీకాకుళం: నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగం గ్రామంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాన్ తొలి ఓటు వేశారు.
► విశాఖపట్నం: రాంపురం పోలింగ్ స్టేషన్‌లో ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
► గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలోని పెద్ద కాకాని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మొదటి ఓటు వేశారు. ఇదే పోలింగ్ కేంద్రంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నయ్య ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయం. 7.00
► పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గంలోని రాయన్నపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బాయ చౌదరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
►పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేసి తమ పనులు చేసుకునేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు.
ఉదయం. 6.30
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిస్తేనే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు.
ఉదయం. 6.25
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 6.30 పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 3.30 గంటల వరకు పోలింగ్ ముగుస్తుంది. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఉదయం. 6.20
7,475 మంది పోటీ:
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆదివారం 161 మండలాల పరిధిలో 2,743 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా మొత్తం 7,475 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఆఖరి విడతలో 33,435 వార్డులకుగానూ 10,921 చోట్ల ఏకగ్రీవంగా ముగిశాయి. మరో 91 చోట్ల వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 22,423 వార్డులకు నేడు పోలింగ్ జరగనుంది. వార్డు పదవులకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి అంకంలోకి చేరుకున్నాయి. ఆఖరి విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. తుది విడతలో 161 మండలాల పరిధిలో 2,743 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 7,475 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతల్లో నిర్వహించేలా నోటిఫికేషన్లు జారీ కావడం తెలిసిందే. ఆఖరి విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి.
వైఎస్సార్ జిల్లాలో రెండు చోట్ల సర్పంచి పదవికి ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆదివారం 2,743 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆఖరి విడతలో 33,435 వార్డులకుగానూ 10,921 చోట్ల ఏకగ్రీవంగా ముగిశాయి. మరో 91 చోట్ల వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 22,423 వార్డులకు నేడు పోలింగ్ జరగనుంది. వార్డు పదవులకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సాయంత్రం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
67.75 లక్షల మంది ఓటర్లు..
ఆఖరి విడత పంచాయతీ ఎన్నికలు 28,995 కేంద్రాల్లో నిర్వహిస్తుండగా సుమారు 67.75 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 6,047 సమస్యాత్మక, 4,967 అత్యంత సమస్యాత్మక కేంద్రాలలో ఓటింగ్‌ను ఎస్‌ఈసీ, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్ విధులకు 88,091 మంది సిబ్బందిని నియమించగా శనివారం సాయంత్రమే సామగ్రితో ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. పర్యవేక్షణ అధికారులుగా 4,570 మందిని నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం 70,829 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.
283 గ్రామాల్లో నిలిచిపోయిన ఎన్నికలు..
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతున్నప్పటికీ 283 పంచాయతీల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించడం లేదు. కోర్టు కేసులు, ఇతర సమస్యల కారణంగా 274 పంచాయతీలలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్లే జారీ చేయలేదు. మరో 9 చోట్ల సర్పంచి, వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు నిలిచిపోయాయి.
పల్లె పోరుకు పటిష్ట బందోబస్తు..
పంచాయతీలకు చివరి దశ ఎన్నికలను సజావుగా పూర్తి చేసేందుకు పోలీస్ శాఖ పటిష్ట ఏర్పాట్లు చేసింది. 16 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 161 మండలాల్లో నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ గ్రామాల్లో దాదాపుగా ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఫ్యాక్షన్ , పాత కక్షల చరిత్ర ఉన్న గ్రామాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. పోలీస్ బృందాలు శనివారం ఉదయం నుంచే రంగంలోకి దిగి సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో కవాతు నిర్వహించాయి. తుది విడత ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 48 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment