సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య ఏడేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘ఏపీ పోలీస్ అకాడమీ (అప్పా)’ విషయంలో కీలక ముందడుగు పడనుంది. విభజన చట్టం పదో షెడ్యూల్‌లో ఉన్న ఈ సంస్థ అధికారిక విభజనకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్వరలో ఎంవోయూ కుదరనుంది. దీంతో ఏపీలో పూర్తిస్థాయి పోలీసు అకాడమీ ఏర్పాటుతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమం కానుంది.
చదవండి: Flipkart CEO: విజనరీ సీఎం.. వైఎస్ జగన్
ప్రభుత్వ చొరవతో త్వరలో ఎంవోయూ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు రాష్ట్రాల ఉమ్మడి సంస్థల విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. హోంశాఖకు సంబంధించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల విభజన ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. తాజాగా పోలీస్ అకాడమీ విభజన అంశాన్ని వేగవంతం చేసింది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్లలోపే ఈ సంస్థల విభజన పూర్తి కావాలి. అలా అయితేనే ఆ సంస్థలను రాష్ట్రంలో నెలకొల్పేందుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది.
ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల పోలీస్ అకాడమీల అదనపు డీజీలు పలు దఫాలుగా చర్చించి సూత్రప్రాయంగా ఓ అంగీకారానికి వచ్చారు. త్వరలోనే పోలీస్ అకాడమీ విభజన ఒప్పందంపై రెండు రాష్ట్రాల డీజీపీలు సంతకాలు చేసి ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. అనంతరం అధికారులు, సిబ్బందిని ఏపీ, తెలంగాణ మధ్య 52: 48 నిష్పత్తిలో పంపిణీ చేస్తారు. రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఎంవోయూ కాపీని కేంద్ర హోంశాఖకు సమర్పిస్తారు.
దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తేనే పోలీస్ అకాడమీ విభజన ప్రక్రియ అధికారికంగా పూర్తి అవుతుంది. విభజన చట్టం హామీ మేరకు ఏపీలో కొత్తగా పోలీస్ అకాడమీ ఏర్పాటుకు కేంద్రం దాదాపు రూ.500 కోట్ల వరకు నిధులు సమకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాల భూమిని కేటాయిస్తుంది. ఇప్పటికే పోలీస్ అకాడమీ కోసం భూమిని ప్రాథమికంగా గుర్తించారు. ఎంవోయూ ప్రక్రియ వారం పది రోజుల్లో పూర్తి కాగానే మిగిలిన అంశాలను వేగవంతం చేయాలని హోంశాఖ భావిస్తోంది. ఏడాదిలో పూర్తిస్థాయిలో పోలీస్ అకాడమీని నెలకొల్పనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment