విశాఖలో నీటిలో చిక్కుకున్న అపార్ట్‌మెంట్ వాసులను తరలిస్తున్న పోలీసులు
సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరోసారి నిరూపించింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేలకొరిగిన వృక్షాలు తొలగించడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు చేర్చడంలో శక్తివంచన లేకుండా పనిచేశారు.
► శ్రీకాకుళం జిల్లాలో గార, వజ్రపుకొత్తూరు, జి.సిగడాం, కవిటి, సంతబొమ్మాళి తదితర మండలాల్లో ఆదివారం రాత్రి నేలకొరిగిన భారీ వృక్షాలను సోమవారం తెల్లవారుజాముకల్లా పోలీసులు తొలగించారు.
► విజయనగరం జిల్లా భోగాపురం, పూసపాటిరేగ తదితర మండలాల్లో తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షితంగా తరలించారు.
► విశాఖ జిల్లాలోని నారాయణపట్న బ్రిడ్జి, తాండవ బ్రిడ్జి, హుకుంపేట బ్రిడ్జి, సోమదేవపల్లి, బంగారంపాలెం, రాజయ్యపేట, దొండవాక తదితర లోతట్టు ప్రాంతాల వాసులను పోలీసులు పునరావాస శిబిరాలకు చేరవేశారు.
► పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంలోని జల్లేరు వంతెనపై రాకపోకలకు కలిగిన అంతరాయంపై పోలీసులు సత్వరం స్పందించి పరిష్కరించడం ప్రశంసలు అందుకుంది. పోలవరం సీఐ అల్లు నవీన్, బుట్టాయగూడెం ఎస్సై జయబాబు మరమ్మతులు చేయించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం తొలగించారు.
► కోల్‌కతా–చెన్నై హైవేపై రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. దాంతో పూర్తిస్థాయిలో సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment