సిట్‌ నివేదిక: టీడీపీకి కొమ్ముకాసిన అధికారుల్లో టెన్షన్‌ | AP Police Who Favour TDP Tension With SIT Report | Sakshi
Sakshi News home page

సిట్‌ నివేదిక: టీడీపీకి కొమ్ముకాసిన అధికారుల్లో టెన్షన్‌.. టెన్షన్‌

Published Wed, May 22 2024 2:25 PM | Last Updated on Wed, May 22 2024 2:35 PM

AP Police Who Favour TDP Tension With SIT Report

సిట్ ప్రాధమిక నివేదికపై కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పోలీసు వైఫల్యాన్ని సిట్ బట్టబయలు చేసింది. విధి నిర్వహణలో కొందరు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ తన ప్రాధమిక నివేదికలో పేర్కొంది. ఈ నేపధ్యంలో సిట్ నివేదిక ఆధారంగా పోలీసులపైనా కేసులు నమోదు చేసి విచారణ జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఎన్నికల అనంతర ఘర్షణలపై సిట్ ప్రాధమిక నివేదిక.. ఇపుడు పోలీసుల మెడకు చుట్టుకోబోతోంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ రెండు రోజుల పాటు విచారణ జరిపి డీజీపీ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాధమిక నివేదిక పంపారు. ఈ మూడు జిల్లాలలో 33 ప్రధాన సంఘటనలపై క్షేత్రస్ధాయిలో విచారణ జరిపారు. పల్నాడు జిల్లాలోని గురజాల, నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పోలీసు అధికారుల వైఫల్యాన్ని సిట్ గుర్తించింది. ముఖ్యంగా నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలోని 18 కేసులలో 474 మంది నిందితులుంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడాన్ని సిట్ తీవ్రంగా పరిగణించింది. ఇందులో 307 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల స్టేట్ మెంట్ ని కూడా సిట్ సీరియస్ గా తీసుకుంది. 

ఇక తాడిపత్రిలో ఏకంగా పోలీసులు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలను ద్వంసం చేయడం వెనుక కారణాలను సిట్ విశ్లేసించింది. ఈ మూడు జిల్లాలలో జరిగిన 33 హింసాత్మక ఘటనల్లో దాదాపు 1370 మంది నిందితులుంటే కేవలం 124 మందినే అరెస్ట్ చేయడంపై పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ అభిప్రాయపడింది. ఇదే సమయంలో పల్నాడు లాంటి జిల్లాలలో కొందరు పోలీసు అధికారులు టీడీపీ నేతల దగ్గర లంచాలు తీసుకుని తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాశారని.. కొన్ని చోట్ల పోలింగ్ బూత్ లలో ఓటర్లని రానివ్వకుండా టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని వైఎస్సార్సీపీ ఇప్పటికే ఈసీకి, డీజీపీ, సిట్ కు కూడా ఫిర్యాదులు చేసింది. పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం కొత్తగణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీలపై ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు దాడులు చేయడంతో వారంతా ఊళ్లు వదిలి వెళ్లిపోయారు. 

ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో కూడా మైనార్టీలు టీడీపీ దాడులతో గ్రామం విడిచి కుటుంబాలతో సహా వెళ్లిపోయారు. ఇంత జరిగినా ఆయా గ్రామాలలో జరిగిన ఘటనలపై పోలీసులు పూర్తిస్ధాయిలో కేసులు నమోదు చేయలేదు. అరెస్ట్ లు కూడా చేయలేదు. పైగా టీడీపీ దాడులతో భీతిల్లి గ్రామాలు విడిచివెళ్లిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలైన ఆ బాదితులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని సిట్ గుర్తించింది. మరోవైపు నరసారావుపేట టీడీపీ అభ్యర్ధి చదలవాడ అరవిందబాబు పోలింగ్ రోజు ఇతర ప్రాంతాల నుంచి గూండాలని రప్పించి వైఎస్సార్సీపీ అభ్యర్ధి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడులు చేయడం, అక్కడున్న కార్లపై కర్రలు, రాళ్ల దాడిచేయడం, ఇంటిని ద్వంస చేసారు.అడ్డుకునే ప్రయత్నం చేసిన గోపిరెడ్డి మామ కంజుల కోటిరెడ్డిపైనా హత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు టీడీపీ అభ్యర్ధి అరవిందబాబుని అరెస్ట్ చేయలేదు. పోలింగ్ తర్వాత పెట్రో బాంబులు, రాడ్లు, కర్రలు, గాజుసీసాలు వంటి మారణాయుదాలతో టీడీపీ నేతలు దొరికినా కూడా పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని పోలీసులని సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఈ నేపధ్యంలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలలో పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయలేదని సిట్ ప్రాధమిక నివేదికలో పేర్కొంది. సీరియస్ ఘటనలలో సైతం కొందరు పోలీసులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారని...కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు నమోదు చేయాలని సిట్ ప్రాధమిక నివేదికలో పేర్కొంది.రాళ్లు, కర్రలు, పెట్రో బాంబులు వంటి వాటితో దాడుల జరగాలంటే ముందుగానే వాటిని సేకరించి ఉంటారని...ఇందుకోసం ముందస్తుగానే ప్రిపేర్ అయ్యారని..ప్రీ ప్లాన్ గానే ఈ దాడులు జరిగాయని సిట్ భావించింది. ఈ ఘటనలలో పోలీసుల వైఫల్యాలని సిట్ సీరియస్ గానే తీసుకున్నట్లు కన్పిస్తోంది.

వైఎస్సార్‌సీపీ ఆరోపణలకి తగ్గట్లుగా పోలీసులు టీడీపీకి కొమ్ముకాయడాన్ని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్, పల్నాడు ఎస్పీ బిందుమాధవ్ తో పాటు సంఘటనలు జరిగిన మూడు జిల్లాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 12 మంది పోలీసులని సస్పెన్షన్ చేయడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్పీలతో పాటు 12 మంది పోలీసు అధికారులకు 15 రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో పాటు శాఖాపరంగానూ విచారణ ప్రారంభం కానుంది.

మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ ప్రాధమిక నివేదిక చేరడంతో తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల రోజు.. ఆ తర్వాత ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటకే ప్రాధమిక చర్యలు తీసుకోవడంతో సిట్ పూర్తి స్ధాయి నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయనే మరో వాదన కూడా ఉంది. రెండు రోజుల పాటు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇచ్చిన సిట్ ఇపుడు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. సిట్ ఆదేశాల మేరకు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. 

ఈ నేపధ్యంలో ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్న దాదాపు 1,200 మందికి పైగా నిందితులకు సంకెళ్లు వేసే పనిలో పోలీసులు పడ్డారు. నిందితుల అరెస్ట్ తో పాటు దర్యాప్తు కూడా వేగవంతంగా కొనసాగాల్సి ఉండటంతో ప్రస్తుతానికి ఈసి కూడా సిట్ పూర్తిస్ధాయి నివేదిక కోసం వేచిచూడవచ్చంటున్నారు.ఒకవేళ ప్రాధమిక నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకోవాలని భావిస్తే మాత్రం సస్పెండ్ అయిన ఇద్దరు ఎస్పీలు, 12 మంది పోలీసు అధికారులతో కొందరిపై కేసులు నమోదుకు ఆదేశించవచ్చంటున్నారు.కేసులు నిరూపణ జరిగితే సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం లేదా జైలు శిక్ష లేదంటే రిటైర్ తర్వాత పెన్షన్ రాని పరిస్ధితులు ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే పోలీసులపై కేసు సంచలనంగా మారే అవకాశాలున్నాయి. మొత్తంగా టీడీపీకి కొమ్ముకాసిన పోలీసులకి ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో కంటిమీద కునుకు లేకుండా పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement