మాటేసిన మహమ్మారి..10 నుంచి ప్రికాషన్‌ డోసు | AP Sees Slight Rise In Active Covid Cases | Sakshi
Sakshi News home page

మాటేసిన మహమ్మారి..10 నుంచి ప్రికాషన్‌ డోసు

Published Sat, Jan 8 2022 8:37 AM | Last Updated on Sat, Jan 8 2022 8:42 AM

AP Sees Slight Rise In Active Covid Cases - Sakshi

సాక్షి, అమరావతి:  కొద్ది రోజులుగా ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా ఎక్కువవుతున్నాయి. సంక్రాంతికి పల్లెలకు వస్తున్నవారు, పండుగ షాపింగ్‌లు, విద్యా సంస్థలకు శనివారం నుంచి సెలవులు ప్రకటించడంతో రాకపోకలు పెరిగాయి. ప్రయాణాలు, షాపింగ్‌లు, పండుగ సంబరాల్లో నోరు, ముక్కు పూర్తిగా కప్పి ఉంచేలా మాస్కులు ధరించడంతోపాటు తరచూ చేతులు శానిటైజ్‌ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సమూహాలకు దూరంగా ఉండటం లాంటి జాగ్రత్తలు పాటించకుంటే వైరస్‌ను ఆహ్వానించినట్లేనని హెచ్చరిస్తున్నారు. 

ఐదు రోజుల్లోనే..
గత వారంతో పోలిస్తే కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. డిసెంబర్‌ 27 నుంచి జనవరి 2వ తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 940 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా గత ఐదు రోజుల్లోనే (సోమవారం నుంచి శుక్రవారం వరకు) 2,155కి పాజిటివ్‌ కేసులు పెరిగాయి. గత వారంతో పోలిస్తే 43.61 శాతం కేసులు అదనంగా నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 28 ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి.

పెరిగిన పరీక్షలు
కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిబంధనలు అతిక్రమించిన 9,814 మందికి గత వారం రోజుల్లో పోలీస్, ఇతర శాఖలు జరిమానాలు విధించాయి. 

ముందే అప్రమత్తం
ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు వారం రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా శుక్రవారం ప్రకటన చేసింది. అయితే అంతకంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాంటి ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచాలని గత డిసెంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తోంది. ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వెంటనే కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకొచ్చింది. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి రాష్ట్రానికి వచ్చిన 48,941 మంది విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేశారు. 201 మంది విదేశీ ప్రయాణికులు, వారి సన్నిహితులకు కరోనా నిర్ధారణ అయింది. వీరిలో 28 మందికి ఒమిక్రాన్‌గా నిర్ధారించారు.

10 నుంచి ప్రికాషన్‌ డోసు 
థర్డ్‌ వేవ్, ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో 60 ఏళ్లు పైబడి ఆరోగ్య సమస్యలున్న వృద్ధులు, హెల్త్‌ కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఈనెల 10వ తేదీ నుంచి కరోనా ప్రికాషన్‌ డోసు టీకాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రికాషన్‌ డోసు పంపిణీపై కలెక్టర్లు, జేసీలు, వైద్యాధికారులకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ హైమావతి మార్గదర్శకాలు జారీ చేశారు. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్‌ తీసుకుంటే అదే వ్యాక్సిన్‌ను ప్రికాషన్‌ డోసు కింద అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండో డోసు తీసుకుని 39 వారాలు గడిచిన వారు ప్రికాషన్‌ డోసు పొందేందుకు అర్హులు.


జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి
ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో 70 శాతం మంది హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉంటూ వైరస్‌ను జయించారు. 30 శాతం మంది ఆసుపత్రులకు వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 706 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 15 వేల సాధారణ, 28 వేల ఆక్సిజన్‌ బెడ్లు, సుమారు 7 వేల ఐసీయూ పడకలు కరోనా చికిత్సకు సిద్ధంగా ఉన్నాయి. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.
– కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ 

ఇవీ మార్గదర్శకాలు
ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు శని, ఆదివారాల్లో తమ పరిధిలోని గృహాల్లో 60 ఏళ్లకు పైబడి ప్రికాషన్‌ డోసుకు అర్హులైన పెద్దలను గుర్తించాలి.
గ్రామ/వార్డు సచివాలయాల్లో సోమవారం నుంచి టీకా పంపిణీ చేపట్టాలి. 13వ తేదీలోపు టీకా పంపిణీ పూర్తి చేయాలి.
తమ పరిధిలోని మెడికల్, నాన్‌ మెడికల్‌ వైద్యులు, ఇతర సిబ్బందికి ప్రికాషన్‌ డోసు
ఇప్పించాల్సిన బాధ్యత మెడికల్‌ ఆఫీసర్‌లు, సూపరింటెండెంట్‌లదే. 
12, 13వ తేదీల్లో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ప్రికాషన్‌ డోసు పంపిణీకి ప్రత్యేక డ్రైవ్‌.
మున్సిపల్‌ ఉద్యోగులు, సిబ్బంది, వార్డు వలంటీర్లకు మున్సిపల్‌ కమిషనర్ల కార్యాలయాల్లో టీకా పంపిణీ.
ఎంపీడీవో కార్యాలయాల్లో గ్రామ వలంటీర్లు, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ ఉద్యోగులకు టీకాల పంపిణీ.
పోలీసులకు పోలీస్‌ స్టేషన్లు, జిల్లా పోలీస్, ఇతర కార్యాలయాల్లో టీకా పంపిణీ.

3.15 కోట్లకుపైగా పరీక్షలు
రాష్ట్రంలో గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 37,849 నిర్ధారణ పరీక్షలు చేయగా 840 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 183 కేసులు నమోదు కాగా కరోనాతో ఒకరు మృతి చెందారు. చిత్తూరులో 150, కృష్ణాలో 88, తూర్పు గోదావరిలో 70,  నెల్లూరులో 69, గుంటూరులో 66 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 22 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇక ఒక్క రోజులో 133 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,79,763కు చేరింది. వీరిలో 20,62,290 మంది కోలుకోగా, 14,501 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2,972 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకూ 3,15,29,919 వైరస్‌ నిర్ధారణ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement