మహిళా సాధికారతలో ఏపీ విజయం: హోంమంత్రి సుచరిత | Ap Stands Top In Women Empowerment Says Mekathoti Sucharitha | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతలో ఏపీ విజయం: హోంమంత్రి సుచరిత

Published Sat, Mar 5 2022 8:54 AM | Last Updated on Sat, Mar 5 2022 8:58 AM

Ap Stands Top In Women Empowerment Says Mekathoti Sucharitha - Sakshi

సాక్షి, అమరావతి: మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిజంగా నిశ్శబ్ద విప్లవంతో విజయం సాధించిందని, ఇది ముమ్మాటికీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనత అని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో శుక్రవారం ‘జాతీయ మహిళా పార్లమెంట్‌–2022’ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సుచరిత మాట్లాడుతూ.. నామినేటెడ్‌ పోస్టులు, నామినేటెడ్‌ పనుల్లోను మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం తేవడం చారిత్రాత్మకమన్నారు.

మహిళల రక్షణ కోసం దిశా యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దిశా చట్టం అమలు చేసేందుకు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపిన విషయాన్ని గుర్తు చేశారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, విద్యా దీవెన, విద్యా వసతి, గోరుముద్ద, పౌష్టికాహారం, మహిళల చేతికే ఇళ్ల పట్టాలు వంటి అనేక పథకాలతో మహిళలు, బాలికలు, చిన్నారులకు నేరుగా మేలు చేస్తున్నారని చెప్పారు. నవరత్నాల పథకాలన్నీ మహిళలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినవేనని అన్నారు. పదవుల్లో 50 శాతం వాటా మాత్రమే కాకుండా మహిళను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళలు రాజకీయ, సామాజిక, ఆర్థిక తదితర రంగాల్లో పురోగమిస్తున్నారని చెప్పారు.

సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న కార్యక్రమాలతో సాధికారత సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. ఆధునిక మహిళ అన్ని రంగాల్లోను పురోగమించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సుచరిత అన్నారు. ప్రారంభ సభకు  మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అధ్యక్షత వహించారు. మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో రానున్న ఏడాది కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలపై ‘సబల’ అనే ప్రణాళికను ఈ నెల 8న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని ప్రకటించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్పలతారెడ్డి, పాఠశాల విద్యా మానిటరింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఆరిమండ విజయ శారదారెడ్డి, యునిసెఫ్‌ ప్రతినిధి సోనీజార్జి, నాగార్జున యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ రాజశేఖర్‌ తదితరులు మాట్లాడారు.  

ఐదు అంశాలపై చర్చ.. తీర్మానం
మహిళ సంక్షేమం కోసం ఐదు ప్రధాన అంశాలను ‘మాక్‌ పార్లమెంట్‌’ ముందు చర్చకు ఉంచారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన దిశ బిల్లును, 50 శాతం మహిళా రిజర్వేషన్, 21 సంవత్సరాల వివాహ వయసు పెంపు తదితర బిల్లులను మాక్‌ పార్లమెంట్‌లో చర్చించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు చట్ట రూపంలో రావడానికి పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉందని, మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మాక్‌ పార్లమెంట్‌ తీర్మానం చేసింది.

కాగా, ఇప్పటికే ఉన్న చట్టాలను బలోపేతం చేయడంలో భాగంగా గృహహింస చట్టం, 125 సీఆర్‌పీసీ, పోష్‌ చట్టం, వివాహ అర్హత వయసు పెంపు, దిశ బిల్లు తదితర చట్టాలకు సంబంధించి సిఫార్సు చేసిన అవకాశాలతో లోపాలను పూరించడంపై చర్చించారు. మహిళల ఆర్థిక సాధికారత అంశంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్‌కు స్పీకర్‌గా వాసిరెడ్డి పద్మ వ్యవహరించగా కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యులు గజ్జల వెంకటలక్ష్మి, కర్రి జయశ్రీ, బూసి వినీత, గడ్డం ఉమ, షేక్‌ రుకియాబేగం వ్యవహరించారు. ఎంపీలుగా వాసవ్య మహిళా మండలి ప్రతినిధులు కీర్తి, పోలిశెట్టి సుభాషిణి, రష్మి, కుమారి, వర్సిటీ ప్రొఫెసర్‌లు విమల, సరస్వతి, నాగార్జున విశ్వవిద్యాలయ అధ్యాపకులు, హెచ్‌వోడీలు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, ఎన్‌జీవో ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement