సాక్షి, విజయవాడ. పదో తరగతి ఫలితాల్లో టాపర్స్ గా నిలిచిన ప్రభుత్వ విద్యార్థులే ఐక్యరాజ్యసమితికి వెళ్లడం జరిగిందని.. ఇది రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించడం మానేసి నిరుత్సాహపరిస్తే వారితో పాటు తల్లిదండ్రుల మనోభావాలు కూడా దెబ్బతింటాయని హితవు పలికారు.
దీనిపై కూడా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని అధునాతన వసతులు, డిజిటల్ విద్యా బోధన తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తద్వారా మెరుగైన విద్యార్థులుగా తీర్చిదిద్ది ప్రపంచంతో పోటీ పడేలా చేస్తోందన్నారు. డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌ల పంపిణీ చేపడతామని స్పష్టం చేశారు. 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్ పాఠ్యాంశ పుస్తకాల మార్పుపై ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవసరమైన మేరకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ కు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో టీచర్ పోస్టుల ఖాళీల భర్తీపై కూడా త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావు లేకుండా.. చిత్తశుద్ధితో పని చేస్తోందని.. ఎక్కడా, ఏ అవకతవకలు జరిగినట్లు తెలిసినా, ఏ మాత్రం నిర్లక్ష్యం చూపకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సీమెన్స్ కంపెనీ గుజరాత్‌లో ఒప్పందం చేసుకుని, స్కిల్ డెవలప్‌మెంట్ యాక్టివిటీ చేసిందని, అందుకు చాలా తక్కువ పెట్టుబడి పెట్టారన్నారు. అక్కడ సాఫ్ట్ వేర్ ఇచ్చి పిల్లలకు శిక్షణ కూడా ఇచ్చారని చెప్పారు. సీపీఎస్ విధానంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎక్కువ అవుతుందన్న నేపథ్యంలో కేంద్రం కూడా ఒప్పుకోవడం లేదు కాబట్టి జీపీఎస్ తీసుకురావడం జరిగిందన్నారు. ఉద్యోగులందరూ దీనిపై సహృదయంతో ఆలోచన చేసి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment