
బండి శ్రీనివాçసులు, బొప్పరాజు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌లో నిధులు క్రెడిట్, డెబిట్ కావడానికి సాంకేతిక సమస్యే కారణమని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం తమను కలసిన ఉద్యోగ సంఘాల నేతలతో అధికారులు చర్చించారు. ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఉద్యోగ సంఘాల నేతలు అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసులు మాట్లాడుతూ.. జీపీఎఫ్‌లో డబ్బు మాయంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు.
ట్రెజరీ, సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) ద్వారా బిల్లులు పాస్ చేసే విధానంలో జరిగిన పొరపాటు వల్ల సమస్య ఉత్పన్నమైందన్నారు. 2018 జూలై 1 నుంచి రావాల్సిన డీఏ ఎరియర్స్ బకాయిలు కొందరికి క్రెడిట్, మరికొందరికి డెబిట్ కావడం ప్రభుత్వ తప్పిదం కాదని అధికారులు తెలిపారన్నారు. సాంకేతికంగా ఏం జరిగిందన్నదానిపై అధికారులు తెలుసుకుంటున్నారని చెప్పారు. జూలై నెలాఖరు లోపు జీపీఎఫ్, మొత్తం డీఏ బకాయిలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు.
బిల్లులు ఒకేసారి చేయడం వల్లే..
జీపీఎఫ్‌లో డబ్బు క్రెడిట్, డెబిట్ అంశంలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేయలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు అన్నారు. సీపీఎస్, ఓపీఎస్ ఉద్యోగుల బిల్లులు ఒకేసారి చేయడంతో ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరించి.. భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూస్తామని అధికారులు చెప్పారన్నారు. అధికారులను కలిసిన వారిలో ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కిషోర్ కుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment