
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు వలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రతి నెలా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా 1 నుంచి 16వ తేదీల మధ్య జిల్లాల పరిధిలో ఉండే వలంటీర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటూ అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ నవీన్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు తమ పరిధిలో ఏర్పడే ఖాళీల వివరాలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.60 లక్షల మంది వలంటీర్లు ఉండగా.. ప్రస్తుతం 7,120 వలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అందులో 5,154 గ్రామ వలంటీర్ పోస్టులు, 1,966 వార్డు వలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. (చదవండి: సచివాలయ వ్యవస్థ సూపర్)
తప్పుడు ప్రచారం.. నమ్మవద్దు
35 ఏళ్లు నిండిన వలంటీర్లను ప్రభుత్వం తొలగిస్తోందని కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని కమిషనర్ నవీన్‌కుమార్ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన ఆరుగురిని మాత్రమే తొలగించడానికి చేపట్టిన చర్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. మిగిలిన వారెవరినీ తొలగించడం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment