రాష్ట్రస్థాయి సదస్సులో ప్రభుత్వ తీరుపై ఏపీ వలంటీర్ల యూనియన్ మండిపాటు
ఎన్నికల ముందు చంద్రబాబు వలంటీర్లకు రూ.10 వేల జీతమిస్తామన్నారు
అధికారంలోకి వచ్చాక జూన్ నుంచి జీతాలే ఇవ్వడం లేదు..
వేతన బకాయిలు చెల్లించి.. ఉద్యోగ భద్రత క ల్పించాలని డిమాండ్
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): అడక్కుండానే వార్డు, గ్రామ వలంటీర్లకు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు.. వాటిని అమలు చేయకుండా వలంటీర్లను అడుక్కునేలా చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వలంటీర్ల యూనియన్ మండిపడింది. ఆంధ్రప్రదేశ్ వలంటీర్ల యూనియన్ రాష్ట్రస్థాయి సదస్సు ఎంబీ భవన్‌లో మంగళవారం జరిగింది. వివిధ జిల్లాల నుంచి తరలివచి్చన యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. వలంటీర్లు ఎవరూ అడగకపోయినా సీఎం చంద్రబాబే వలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
కానీ, అధికారంలోకి వచ్చాక మూడు నెలలుగా వలంటీర్లకు జీతాలు చెల్లించకుండా తమ పొట్టకొడుతున్నారని వాపోయారు. ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విధుల్లో తాము పాల్గొన్నామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అడగకుండానే హామీ ఇచ్చి.. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు వలంటీర్లను ఏదో ఒక పార్టీ వారిగా ముద్రవేసి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్లం కాదన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన బకాయిలు చెల్లించి, నెలవారీ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని కోరుతూ సదస్సు తీర్మానించింది. రాజీనామా చేసిన వలంటీర్లను కూడా మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వలంటీర్లకు ప్రత్యేక వెయిటేజీ ప్రకటిస్తూ, అర్హతలను బట్టి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మరో తీర్మానం చేశారు.
సీఐటీయూ మద్దతు
వలంటీర్ల డిమాండ్లకు సీఐటీయూ మద్దతు తెలిపింది. వలంటీర్ల సమస్యల పరిష్కార సాధనలో సీఐటీయూకు అనుబంధంగా యూనియన్‌ను ఏర్పాటు చేసింది. సీఐటీయూ కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామ, వార్డు వలంటీర్లను విధుల్లో కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, రూ.10 వేల వేతనం చెల్లిస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా హుమయూన్ బాషా, ఉపాధ్యక్షునిగా వెంకటసుబ్బయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా దీప్తి, కోశాధికారిగా హేమంత్‌ను ఎన్నుకున్నారు. సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు కె.ఉమామహేశ్వరరావు, ఆర్‌వీ నరసింహరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment