సాక్షి, అమరావతి: మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజు నియామకం చెల్లదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సంచయిత తరఫున హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలయ్యాయి. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు. మొత్తం ఆరు అప్పీళ్లలో రెండు మాత్రమే మంగళవారం విచారణకు రావటాన్ని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సు«ధాకర్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో మిగిలిన అప్పీళ్లు కూడా విచారణకు వచ్చేందుకు వీలుగా విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
లింగ వివక్ష తగదని సుప్రీంకోర్టు తీర్పు...
దేవదాయ చట్ట నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ జడ్జి తీర్పు ఉందని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీల్‌లో పేర్కొంది. అంతేకాకుండా లింగ వివక్షను ప్రోత్సహించేలా ఉందని నివేదించింది. లింగం ఆధారంగా ఓ వ్యక్తి నియామకాన్ని ఖరారు చేయడం వివక్ష చూపడమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ప్రభుత్వం అప్పీల్‌లో తెలిపింది. కుటుంబంలో పెద్దవారైన పురుషులు మాత్రమే మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఉండాలనడం లింగ వివక్ష కిందకే వస్తుందని, ఈ విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంది. వ్యవస్థాపక కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలను తేల్చాల్సింది దేవదాయశాఖ ట్రిబ్యునల్ మాత్రమేనని స్పష్టం చేసింది. అశోక్ గజపతిరాజు ట్రిబ్యునల్‌కు వెళ్లకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించారని, అందువల్ల సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని అభ్యర్థించింది.
టీడీపీ పిటిషన్లు..
మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయితను, మాన్సాస్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, ఆర్‌వీ సునీత ప్రసాద్‌లను నియమిస్తూ గతేడాది ప్రభుత్వం జీవోలను జారీ చేసింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వంశపారంపర్య చైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ మరో జీవో జారీ చేసింది. ఈ మూడు జీవోలను సవాలు చేస్తూ టీడీపీ నేత అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ వెంకటరమణ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయిత నియామకం, సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, సునీతా ప్రసాద్‌లను నియమిస్తూ జారీ చేసిన జీవోలను రద్దు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు నియామకం తిరిగి అమల్లోకి వస్తుందని తీర్పు ఇచ్చారు.
మాన్సాస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీళ్లు
Published Wed, Jul 14 2021 3:29 AM | Last Updated on Wed, Jul 14 2021 3:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment