గ్రూప్‌-2 గెట్‌ రెడీ.. ఏపీలో పది రోజుల్లో నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం  | Sakshi
Sakshi News home page

ఏపీలో గ్రూప్‌-2 గెట్‌ రెడీ.. శాఖల వారిగా పోస్టుల సంఖ్య ఇలా

Published Sat, Oct 21 2023 3:32 AM

APPSC Group 2 Notification Announced - Sakshi

సాక్షి, అమరావతి: విజయ దశమి వేళ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 950 గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈమేరకు ఏపీపీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 28వతేదీన 508 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 212 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) చిరంజీవి చౌదరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతోపాటు గత నోటిఫికేషన్‌లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు, క్యారీ ఫార్వార్డ్‌ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్‌లోనే భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. తద్వారా గ్రూప్‌–2 కింద దాదాపు 950 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. మరో పది రోజుల్లోనే నోటిఫికేషన్‌ జారీ చేసి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్‌ నిర్వహించాలని సర్వీస్‌ కమిషన్‌ యోచిస్తోంది. 


 

యువత వినతిపై స్పందించిన సీఎం
గ్రూప్స్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ పలు సందర్భాల్లో అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో అనుమతినిచ్చిన పోస్టులతో పాటు వీలైనంత ఎక్కువ సంఖ్యలో భర్తీ చేయాలని స్పష్టం చేయడంతో తాజాగా గ్రూప్‌ 2 విభాగంలో 212 పోస్టులకు అనుమతి ఇచ్చారు. ఆయా శాఖల నుంచి పోస్టుల ఖాళీలను నిర్దారించుకున్న వెంటనే భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా సర్వీస్‌ కమిషన్‌కు ఉత్తర్వుల్లో సూచించారు.

రోస్టర్‌ పాయింట్లతో పాటు విద్యార్హతల ఆధారంగా నిబంధనల మేరకు ఈ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థికశాఖ కోరింది. గ్రూప్స్‌ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది చక్కటి అవకాశం. నోటిఫికేషన్‌ నాటికి ఆయా శాఖల్లో ఉన్న మరిన్ని ఖాళీలను సైతం కలపనున్నారు. దీంతోపాటు గత నోటిఫికేషన్‌లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు, క్యారీ ఫార్వార్డ్‌ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్‌లోనే భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. 
 

Advertisement
Advertisement