ఏపీపీఎస్సీపై నిరాధార ఆరోపణలు | APPSC Member Says Allegations On Group 1 Exams Are Meaningless | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీపై నిరాధార ఆరోపణలు

Published Thu, Jun 24 2021 12:41 PM | Last Updated on Fri, Jun 25 2021 10:57 AM

APPSC Member Says Allegations On Group 1 Exams Are Meaningless - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)పై కొంతమంది రాజకీయ, నిరాధార విమర్శలు, ఆరోపణలు చేయడం తగదని కమిషన్‌ సభ్యుడు ఎస్‌.సలాంబాబు పేర్కొన్నారు. డిజిటల్‌ మూల్యాంకనం గురించి కనీస పరిజ్ఞానం లేకుండా లోకేశ్‌ మాట్లాడుతున్నారని, ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు ఏమైనా సందేహాలుంటే అపాయింట్‌మెంటు తీసుకుని కమిషన్‌ దగ్గరకు వస్తే నివృత్తి చేస్తామని చెప్పారు. ఈ రెండేళ్లలో ఒక్క ఆరోపణ కూడా లేకుండా చాలా నియామకాలు పూర్తిచేసినట్లు తెలిపారు. గతంలో ఇంటర్వ్యూలకు సింగిల్‌బోర్డు ఉండేదని, ఇప్పుడు బహుళ బోర్డులు చేశామని చెప్పారు. ఏ సభ్యుడు ఏ బోర్డులోకి వెళ్తారో కూడా తెలియదని పేర్కొన్నారు. విజయవాడలోని కమిషన్‌ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలిచ్చారు.

అభ్యర్థుల ఎంపిక రేషియో కమిషన్‌ ఇష్టం
గ్రూప్‌–1 మెయిన్స్‌లో ఒక అభ్యర్థి నెల్లూరులో 2 పేపర్లు, హైదరాబాద్‌లో 5 పేపర్లు రాశారనడం సరికాదని, ఆ అభ్యర్థి మొత్తం పేపర్లన్నీ హైదరాబాద్‌లోనే రాశారని చెప్పారు. జీవో ప్రకారం 2 శాతం పోస్టుల్ని స్పోర్ట్స్‌ కోటాలో భర్తీ చేయాలని, అందుకు అర్హులు లేకపోతే అవి ఓపెన్‌ కేటగిరీలో భర్తీచేయాలని నిబంధనలున్నాయని తెలిపారు. ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఏ రేషియోలో పిలవాలన్న అధికారం కమిషన్‌కు ఉంటుందని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలున్నందున అందరికీ సమానావకాశాలిచ్చేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. కొత్తగా ఎంపికైనవారి జాబితా ప్రకటించే సమయానికే బుక్‌లెట్లు ప్రింట్‌ అయ్యాయని,  ఈ సమయంలో కొందరు ఫలానా లాంగ్వేజ్‌లో రాసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరడంతో గ్రూప్‌–1లోని 5 పేపర్లను ఇంగ్లిష్, తెలుగు భాషల్లో దేన్లోనైనా రాసుకోవచ్చని అందరికీ అవకాశం ఇచ్చామని వివరించారు. శ్రీకాకుళం, కాకినాడల్లో బుక్‌లెట్లు మారిపోయాయని ఆరోపణలు సరికాదన్నారు.

మూల్యాంకన విధానం కమిషన్‌ నిర్ణయిస్తుంది
డిజిటల్‌ మూల్యాంకనమంటూ రూలు మార్చారన్న విమర్శలు సరికాదని చెప్పారు. నోటిఫికేషన్‌లోని విద్యార్హతలు, వయసు వంటివి మారిస్తే రూలు మార్చడం అంటారని తెలిపారు. మూల్యాంకన విధానం అనేది ఎక్కడా నోటిఫికేషన్లో పేర్కొనరని, అది కమిషన్‌ పరిధిలో నిర్ణయిస్తారని చెప్పారు.  అయినా.. అభ్యర్థులకు తెలియాలన్న ఉద్దేశంతో డిజిటల్‌ మూల్యాంకనం గురించి మెయిన్స్‌ పరీక్షలకు ఏడాది ముందు 2019 డిసెంబర్‌లోనే ప్రకటించినట్లు గుర్తు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడా లోపాల్లేకుండా 4 నెలల్లో డిజిటల్‌ మూల్యాంకనాన్ని పూర్తిచేసినట్లు చెప్పారు. అభ్యర్థులెవరికీ నష్టం రాకూడదని ట్యాబ్‌ ఆధార ప్రశ్నపత్రాలు ఇచ్చి ఒకేసారి అవి ఓపెన్‌ అయ్యేలా చేశామన్నారు. థర్డ్‌ పార్టీ సాంకేతిక, సాఫ్ట్‌వేర్‌ సహకారం, స్కానింగ్, మ్యాపింగ్‌ వంటి పనులకే తప్ప మూల్యాంకనానికి కాదన్నారు.

ఫూలిష్‌ ఆరోపణలు సహించం
పెద్ద ఎత్తున డబ్బులు మారాయని లోకేశ్‌గానీ, ఎవరైనా సరే ఫూలిష్‌ ఆరోపణలు చేస్తే కమిషన్‌ సహించదని హెచ్చరించారు. ఆధారాలుంటే కోర్టుకు సమర్పించవచ్చన్నారు. ఇదే గ్రూప్‌–1లో 51 తప్పులు వచ్చాయని, వాటిని తాము సరిదిద్ది ఇంటర్వ్యూల వరకు తెచ్చామని చెప్పారు. అప్పుడు లోకేశ్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. గతంలో అనేక లోపాలు జరిగినా ఆయన మాట్లాడలేదన్నారు. 

చదవండి: 2018 గ్రూప్‌-1 క్వాలిఫైడ్‌ అభ్యర్ధుల ఆందోళన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement