సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) మంగళవారం హైకోర్టుకు నివేదించింది. డిజిటల్ మూల్యాంకనం కాకుండా మాన్యువల్‌గానే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలంటూ హైకోర్టు గత ఏడాది అక్టోబర్‌లో ఆదేశాలు ఇచ్చిన తరువాత ఒక్కసారి మాత్రమే మాన్యువల్ మూల్యాంకనం చేయించామని ఏపీపీఎస్‌సీ తరఫు సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు.
చదవండి: ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. రెండు, మూడు రోజుల్లో..
డిజిటల్ మూల్యాంకనంలో ఉత్తీర్ణులైన పలువురు అభ్యర్థులు తాజా మాన్యువల్ మూల్యాంకనంలో ఉత్తీర్ణులు కాకపోవడంతో పలు ఆరోపణలతో ఈ పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. హైకోర్టు తీర్పుతో ఒకసారి మాన్యువల్ మూల్యాంకనం చేసి, అటు తరువాత దాన్ని పక్కన పెట్టి తిరిగి మరోసారి మూల్యాంకనం చేశారని ఆరోపిస్తున్న అభ్యర్థులు అందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచలేదన్నారు. ఉత్తీర్ణత సాధించలేదన్న కారణంతో రాజ్యాంగ సంస్థ అయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు, అందులో పనిచేసే అధికారులకు దురుద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు.
ఇలాంటి వ్యాజ్యాలను అనుమతిస్తూ పోతే పోస్టుల భర్తీ అసాధ్యమని సత్యనారాయణ ప్రసాద్ నివేదించారు. ఉత్తీర్ణులు కాని వారు ఏదో ఒక ఆరోపణతో వివాదం సృష్టిస్తూ పిటిషన్లు వేస్తూ ఉంటారన్నారు. మూల్యాంకనం లాంటి విషయాలు నిపుణులకు సంబంధించినవని, అందులో న్యాయస్థానాల జోక్యం తగదన్నారు. మూల్యాంకనం చేసిన వ్యక్తులను తాము ఎంపిక చేయలేదన్నారు. వీసీలు, విద్యాశాఖ వారిని ఎంపిక చేశారని చెప్పారు. ఏ అభ్యర్థి సమాధాన పత్రాలను ఎవరు మూల్యాంకనం చేస్తారో ఎవరికీ తెలియదన్నారు. అందువల్ల అవకతవకలు, అక్రమాలు జరిగేందుకు ఆస్కారమే లేదని వివరించారు. బుధవారం నుంచి ఇంటర్వ్యూలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను నిలుపుదల చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. తాము చేస్తున్నది కేవలం ఇంటర్వ్యూలే కానీ నియామకాలు కాదన్నారు.
రాజ్యాంగానికి లోబడి పనిచేయడం లేదు..
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు పి.వీరారెడ్డి, ఎ.సత్యప్రసాద్, కేఎస్ మూర్తి తదితరులు వాదనలు వినిపిస్తూ ఐఐటీ స్థాయి అధ్యాపకులతో కాకుండా డిగ్రీ లెక్చరర్లతో మూల్యాంకనం చేయించడం ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. కేవలం 35 రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేశారన్నారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒకసారి మాన్యువల్ మూల్యాంకనం చేశారని, తరువాత దాన్ని పక్కనపెట్టి మరోసారి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు.
మొదటి మాన్యువల్ మూల్యాంకనంలో ఉత్తీర్ణులైన పలువురు అభ్యర్థులను రెండో మూల్యాంకనంలో తొలగించారని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. రాజ్యాంగ సంస్థ అయిన ఏపీపీఎస్‌సీ రాజ్యాంగానికి లోబడి పని చేయడం లేదన్నారు. వాదనల అనంతరం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ కమిషన్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. ఇంటర్వ్యూల విషయంలో ఏం చేయాలన్న దానిపై తగిన ఉత్తర్వులు ఇస్తానని స్పష్టం చేశారు. అయితే ఈ ఉత్తర్వులు రాత్రికి అందుబాటులోకి వస్తాయా? లేక బుధవారం ఉదయం అందుబాటులోకి వస్తాయా? అనే విషయం స్పష్టంగా తెలియరాలేదు.
అవకతవకలు జరిగాయంటూ పిటిషన్లు..
హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ మూల్యాంకనం చేయించిన సర్వీస్ కమిషన్ సరైన విధానాలను అనుసరించలేదని, ఇందులో అక్రమాలు జరిగాయంటూ మాన్యువల్ మూల్యాంకనంలో ఉత్తీర్ణులు కాని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇంటర్వ్యూల ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం విచారణ జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment