సజ్జలను కలిసిన అనంతరం ఆర్టీసీ డ్రైవర్ల సంఘం ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమ్మెకు ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు దూరంగా ఉంటున్నట్లు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవి, కొవూరు ఎజ్రాశాస్త్రిలు ప్రకటించారు. ఈమేరకు తమ సంఘం నిర్ణయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బుధవారం లిఖితపూర్వకంగా తెలియచేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయంతోపాటు కరోనా కష్ట కాలంలో 55 వేల కుటుంబాలకు ప్రతి నెల జీతాలిచ్చి ఆదుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడం అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లేనని చెప్పారు. ఉద్యోగులు ఎవరూ సమ్మెలో పాల్గొనరాదని సంఘం సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు.
ప్రభుత్వంపై విశ్వాసం ఉంది
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం వైఎస్ జగన్‌పై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రజా రవాణా విభాగం(ఆర్టీసీ) ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్(32/2021) పేర్కొంది. తాము సమ్మెలో పాల్గొనబోమని స్పష్టం చేసింది. సంప్రదింపుల ద్వారానే సమస్యలను పరిష్కరించుకుంటామని స్పష్టం చేస్తూ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్(32/2021) రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్తిపాటి కిరణ్ బుజ్జి, ప్రధాన కార్యదర్శి బీవీఎస్‌ఎస్ సత్యనారాయణ తదితరులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమ వ్యవహారాలు) చంద్రశేఖరరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
– పీటీడీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్
సమ్మెలో పాల్గొనం
చలో విజయవాడ, సమ్మెకు తాము మద్దతు ఇవ్వడం లేదని ఆర్టీసీ డ్రైవర్ల సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. తాము సమ్మెలో పాల్గొనడం లేదని ఆర్టీసీ ఎండీ సిహెచ్. ద్వారకా తిరుమలరావుకు సంఘం బుధవారం లిఖితపూర్వకంగా తెలిపింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎంపై తమకు పూర్తి భరోసా ఉందని తెలిపింది. ఆర్టీసీ ఎండీని కలిసినవారిలో డ్రైవర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి డీఎస్ కుమార్, కోశాధికారి డీఎస్ వాసు తదితరులున్నారు.
– ఆర్టీసీ డ్రైవర్ల సంక్షేమ సంఘం
Comments
Please login to add a commentAdd a comment