రొయ్య.. 100 కౌంట్‌ కిలో 240 రూ. | Aqua Empowerment Committee meeting | Sakshi
Sakshi News home page

రొయ్య.. 100 కౌంట్‌ కిలో 240 రూ.

Published Wed, Oct 18 2023 2:53 AM | Last Updated on Wed, Oct 18 2023 2:53 AM

Aqua Empowerment Committee meeting - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంద కౌంట్‌ రొయ్యలకు కిలో రూ. 240గా రేటు ఖరారు చేశామని, ఇంతకన్నా తక్కువకు కొనడానికి వీల్లేదని ఆక్వా సాధికారత కమిటీ స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే తక్కువకు కొనే వారిపై ఏపీ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్రంలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారత కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమైంది.

ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, అప్సడా కో వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం, అధికారులు పాల్గొన్నారు. స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో ఫిష్‌ ఆంధ్రా అవుట్‌లెట్స్‌ను పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేస్తున్నట్లు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు చెప్పారు. ఫలితంగా ప్రతి నెలా స్థానిక వినియోగం వెయ్యి టన్నులకు పెరిగిందన్నారు.

దీనిని మరింత పెంచాలని చెప్పారు. అప్సడా ద్వారా 10 రోజులకోసారి రొయ్య రైతులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ధరల స్థిరీకరణకు కృషి చేస్తున్నట్లు వడ్డి రఘురాం మంత్రులకు వివరించారు. రాష్ట్రంలో రొయ్య రైతులందరితో కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యకు ఇటీవలే తాడేపల్లిలో కార్యాలయాన్ని కూడా ప్రారంభించామన్నారు. నగరాలు, ప్రధాన పట్టణాల్లో ప్రాన్స్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తూ స్థానిక వినియోగాన్ని పెంచుతున్నట్లు తెలిపారు.

నవంబర్‌ 1 నుంచి కొత్త కనెక్షన్లకు విద్యుత్‌ సబ్సిడీ
సీఎం వైఎస్‌ జగన్‌ నియమించిన సాధికారత కమిటీ కృషి ఫలితంగా ఇప్పటి వరకు 6 సార్లు ఆక్వా ఫీడ్, సీడ్‌ రేట్ల పెరుగుదలను నియంత్రించగలిగామని మంత్రులు చెప్పారు. గతంలో ఫీడ్, సీడ్‌ రేట్లను నియంత్రించే విధానం లేకపోవడం వల్ల ఆక్వా రైతులు నష్టపోయే వారని, రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి లేదని తెలిపారు. ఆక్వా జోన్‌ పరిధిలో 4.65 లక్షల ఎకరాలు సాగవుతుండగా, దాంట్లో విద్యుత్‌ సబ్సిడీకి అర్హత పొందిన (10 ఎకరాల్లోపు ) విస్తీర్ణం 3.26 లక్షల ఎకరాలుగా గుర్తించామన్నారు. తొలుత ఈ–ఫిష్‌ సర్వే ద్వారా 46,433 ఆక్వా విద్యుత్‌ కనెక్షన్లకు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు.

అర్హత ఉన్న ప్రతి రైతుకు అండగా నిలవాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రైతుల దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మరో 4,230 కనెక్షన్‌లకు విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. కొత్తగా అర్హత పొందిన వారికి నవంబర్‌ 1 నుంచి సబ్సిడీ విద్యుత్‌ అందించాలని డిస్కంలను మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, మత్స్య శాఖ కమిషనర్‌ కూనపురెడ్డి కన్నబాబు, అడిషనల్‌ డైరెక్టర్‌ అంజలి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement