సాక్షి, విశాఖపట్నం: విలువిద్యలో ఆరితేరిన గిరిజనుల పిల్లల్ని ఆర్చర్లుగా తీర్చి దిద్దుతామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆదివాసీ ప్రాంతంలో ఆర్చరీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వీటికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఆదివాసీలకు పూర్తిస్థాయి సదుపాయాలు కల్పిస్తామని, అటవీ హక్కుల చట్టాలు పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం చింతపల్లిలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రంప తిరుగుబాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు.
అల్లూరి దాడిచేసిన పోలీస్ స్టేషన్ ఆవరణలో సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి అనుచరుడు గంటం దొర మనుమడు బోడి దొరని ఘనంగా సత్కరించారు. వారి వారసులు 11 మంది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. న్యాయవాది కరణం సత్యనారాయణరాజు ఆంగ్లంలో రచించిన ‘లెజెండరీ అల్లూరి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ గిరిజనులు ఆత్మాభిమానం కోసం ప్రాణాలు పణంగా పెడతారని చెప్పారు. అల్లూరి బ్రిటిష్ వారిపై విప్లవాగ్ని రగిలించడం గర్వంగా ఉందన్నారు.
గిరిజన సంప్రదాయ కొమ్ములతో.. కేంద్ర మంత్రులు అర్జున్‌ముండా, కిషన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, కళావతి తదితరులు
గిరిజనుల ఉన్నత విద్యకు 2014 నుంచి దేశవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల్ని ప్రారంభించామని, 740కి పైగా పాఠశాలలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం బడ్జెట్‌ను రూ.12 కోట్ల నుంచి రూ.38 కోట్లకు పెంచామన్నారు. ఆదివాసీలకు దైవంతో సమానమైన చెట్టు, పుట్ట, భూమిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరం కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. అటవీ ఉత్పత్తుల్ని పెంచి, వాటి మార్కెటింగ్‌కు మోడల్ విలేజ్‌లు అభివృద్ధి చేసి గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి అర్జున్ ముండా తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బెంగళూరు, ఢిల్లీలోనూ అల్లూరి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని, తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ఆధ్వర్యంలోనూ వేడుకలు జరుపుతామని అన్నారు.
అల్లూరి నడయాడిన ప్రాంతాల్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర మాట్లాడుతూ గిరిజనులకు 9 లక్షల ఎకరాలకు పైగా అటవీ హక్కు పత్రాలు అందించిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. రాజేంద్రపాలేన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. కృష్ణదేవి పేటలో రూ.66 లక్షలతో అల్లూరి స్మృతి వనం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, కళావతి తదితరులు పాల్గొన్నారు.
అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు: కిషన్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: అమిత్‌షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరి మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందన్నారు. సీనియర్ ఎన్టీఆర్ గురించి, ఆయన చేసిన పలు సినిమాల గురించి అమిత్ షా అడిగి తెలుసుకున్నారని వివరించారు. జూనియర్ ఎన్టీఆర్‌తో డిన్నర్ మీట్‌కు అమిత్ షా కోరిన నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment