
టీడీపీ నేతల బండారం బయట పెడతాను
ఇంకా మౌనంగా ఉంటే మా ప్రతిష్ట దిగజారిపోతోంది
ఇన్ని నిందలు మోపుతుంటే మౌనంగా ఉండాలా.. బాధపడాలా?
ఇక ఎవరి మాట వినను
మహా అయితే చంపేస్తారు
కలకలం రేపుతున్న జీవిత ఖైదీ శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ పోస్టింగ్
సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘మమ్మల్ని వాడుకుని వదిలేశారు. ఇప్పుడు మాపైనే విషప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతల బండారం బయట పెడతా. మౌనంగా ఉంటే మా ప్రతిష్ట దిగజారిపోతోంది. ఇన్ని నిందలు మోపుతుంటే ఇంకా మౌనంగా ఉండాలా.. ఇంకా బాధపడాలా?. ఇకపై ఎవరి మాట వినను. ఏం చేస్తారు మహా అయితే నన్ను చంపేస్తారు. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికేకన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అంటూ మంగళవారం కొందరు విలేకరుల వద్ద కుండబద్దలు కొట్టారు జీవిత ఖైదీ శ్రీకాంత్ సన్నిహితురాలు నిడిగుంట అరుణ.
జీవిత ఖైదీ శ్రీకాంత్‌తో ఆస్పత్రిలో అరుణ సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు, ఫొటోలు బయటకు రావడం వెనుక టీడీపీ నేతల కుట్ర దాగి ఉందని అరుణ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు కూడా పెట్టారు. ఆ పోస్టులో అరుణ ఏమని వ్యాఖ్యానించారంటే.. ‘మాపై ఇంత కుట్ర జరుగుతుంటే.. శ్రీకాంత్ బాధపడుతుంటే శ్రీకాంత్‌ను ఇన్నాళ్లు వాడుకున్న వాళ్లంతా నోరు మెదపకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీ మౌనాన్ని మేం ఎలా అంచనా వేసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు నేను శ్రీకాంత్ మాట విని నోరు మెదపకుండా ఉండాలి? ఓపెన్ అయిపోతే మేలు కదా.
ఇంకనైనా స్పందిస్తారా? శ్రీకాంత్ మాట కూడా లెక్కచేయకుండా నేను నోరు విప్పేయాలా? మహా అయితే మీరు చంపేస్తారు! అంతే కదా! ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికే కన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అంటూ ఆ పోస్టులో అరుణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కుదిపేస్తున్న శ్రీకాంత్ వ్యవహారం
హత్య కేసులో నెల్లూరు జిల్లా జైలులో జీవిత ఖైదీగా ఉంటూనే శ్రీకాంత్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం, టీడీపీ క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్న అతను ఆ పార్టీ కీలక నేతల సహకారంతో తరచూ పెరోల్‌పై బయటకు వస్తున్న వైనం ఇప్పుడు అధికార పార్టీని, ప్రభుత్వ పెద్దల నుంచి హోంశాఖను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు హోంశాఖ స్థాయిలో కథ నడిపించారనేది స్పష్టం కావడంతో ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసిన ఐదు రోజుల్లోనే దానిని రద్దు చేసి, ఖైదీని జైలుకు తరలించారు.
అండగా ఓ మంత్రి, ఇద్దరు ప్రజాప్రతినిధులు
అరుణ పోస్టు ప్రకారం ఒక మంత్రి, ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆమెకు అండగా ఉన్నారనే కొత్త కోణం వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. అ«ధికార పార్టీకి చెందిన నేతలకు, క్రిమినల్స్‌కు మధ్య సంబంధాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే అరుణ, శ్రీకాంత్‌తో తమకు ప్రాణ హాని ఉందని.. నెల్లూరు, గూడూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఐదుగురు 15 రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆమె సన్నిహితుడు శ్రీకాంత్ జైల్లోనే ఉండి నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం, ఆయనకు ఎస్కార్ట్‌గా ఉన్న ఇద్దరు ఏఆర్ పోలీసులు సహకరించడం, తరచూ పెరోల్‌పై బయట తిరగడం వంటి అంశాలపై జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలుస్తోంది.
శ్రీకాంత్‌కు పెరోల్ ఇచ్చింది మా ప్రభుత్వమే
హోం మంత్రి వంగలపూడి అనిత
సాక్షి, అమరావతి: శ్రీకాంత్‌కు తమ ప్రభుత్వమే పెరోల్ ఇచ్చిందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి అనిత మంగళవారం విలేకరులతో మాట్లాడారు. శ్రీకాంత్ పెరోల్ కోసం నెల్లూరుకు చెందిన అరుణ నుంచి హోం శాఖ పేషీకి ఫోన్ వచ్చిందని ఆమె చెప్పారు. ఆమె వెనుక ఎవరున్నారనే విషయం గురించి ఆరా తీస్తున్నామన్నారు. క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి పెరోల్ వచ్చిందని జైలు అధికారులు చెప్పగానే ఆ పెరోల్‌ను రద్దు చేశామన్నారు.
శ్రీకాంత్ వ్యవహారంలో ఎస్కార్ట్ సిబ్బందిపైనా చర్యలు చేపడతామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలతో పెరోల్ మంజూరు చేయాలని మీరే సిఫారసు చేశారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా..ఆ విషయాలన్నీ పోస్ట్‌మార్టం చేయవద్దని మంత్రి వ్యాఖానించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామన్నారు.