టీడీపీ వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఉడతా శ్రీనివాసరావు
తాడికొండ (గుంటూరు): వైఎస్సార్‌సీపీ నాయకుడిపై టీడీపీ వర్గీయులు హత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, రైతు భరోసా కేంద్రాల మేడికొండూరు మండల చైర్మన్ ఉడతా శ్రీనివాసరావు గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. డోకిపర్రులో రైతు భరోసా కేంద్రానికి ప్రభుత్వ స్థలం కేటాయించారు. అందులో కొంత స్థలాన్ని టీడీపీ వర్గీయులు చేవూరి వెంకటేశ్వరరావు, అతని కుమారులు సాంబశివరావు, కోటేశ్వరరావు, గంగయ్య ఆక్రమించుకుని నివసిస్తున్నారు.
రైతు భరోసా కేంద్రానికి స్థలం కేటాయించడంతో అక్కసు పెంచుకున్న వెంకటేశ్వరరావు, అతని కుమారులు తరచూ అక్కడికి వెళ్తున్న అధికారులను దూషిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు ఉడతా శ్రీనివాసరావు అక్కడేం జరుగుతుందో తెలుసుకుందామని వెళ్లగా.. టీడీపీ వర్గీయులు కత్తి, కర్రలతో ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేయగా శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. ఘటనపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ వర్గీయుల దాడిని ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తీవ్రంగా ఖండించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ గూండాలు కావాలని అతనిపై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment