
సాక్షి, అమరావతి : దిగుమతులపై కాకుండా స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ పథకాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తొలి దశలో కనీసం రూ.20,000 కోట్ల పై చిలుకు కేంద్ర నిధులతో భారీ ప్రాజెక్టులను చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. కోవిడ్-19 తర్వాత భారతదేశం దిగుమతులపై ఆధారపడకుండా సొంత అవసరాలతో పాటు ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ.. ఆత్మనిర్భర్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఆరు రంగాల్లో సుమారు రూ.20,860 కోట్ల కేంద్ర నిధులతో ప్రాజెక్టులను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రూ.6,000 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్
ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్‌వై) కింద రూ.6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మెగా ఫుడ్ పార్కులు, శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనుంది.
ఈఎంసీ-2 కోసం 3,760 కోట్లు
మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు 90 శాతం చైనా నుంచే దిగుమతి అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశీయ తయారీపై దృష్టి సారించింది. ఇందుకోసం వచ్చే మూడేళ్ల కోసం ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్-2 (ఈఎంసీ-2) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.3,760 కోట్ల వరకు కేంద్ర నిధులను వినియోగించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీని ఏర్పాటు చేస్తోంది. దీనికి అదనంగా చిత్తూరు జిల్లా పాదిరేడు అరణ్యం వద్ద మరో ఈఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి అదనంగా ఐటీ రంగంలో పార్కుల అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.100 కోట్ల నిధులు రాబట్టడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
రూ.1,000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్
దేశీయ ఫార్మా అవసరాలకు తగ్గట్టుగా కనీసం మూడు బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు ఒక్కో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు రూ.1,000 కోట్లు కేటాయించింది. దీన్ని సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్, ఒరిస్సా వంటి రాష్ట్రాలతో గట్టిగా పోటీపడుతోంది.
రూ.5,000 కోట్లతో మౌలిక వసతులు
సరుకు రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక రైల్వే కారిడార్లు, పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టులను కలిపే విధంగా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏపీ మారిటైమ్ బోర్డు పంపిన ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. దీనికి కింద కనీసం రూ.5,000 కోట్లకు తక్కువ కాకుండా రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టే అవకాశముందని అంచనా.
రూ.5,000 కోట్లతో పారిశ్రామిక ఇన్‌ఫ్రా
దేశంలో పారిశ్రామిక రంగ మౌలిక వసతులను పెంచడానికి కేంద్రం ప్రత్యేకంగా పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిట్)ను ఏర్పాటు చేసి నిధులను విడుదల చేస్తోంది. రాష్ట్రం మీదుగా వెళుతున్న మూడు పారిశ్రామిక కారిడారల్లో తొలి దశ కింద వివిధ క్లస్టర్లను రూ.5,000 కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment