
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును నిమ్మాడలో మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్మాడ సర్పంచ్ అభ్యర్ధి, వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు అప్పన్న తన కుటుంబ సభ్యులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి కోట బొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పన్న ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఎఫ్‌ఐఆర్(44/2021) నమోదు చేశారు. కోటబొమ్మాళి పీఎస్‌కు అచ్చెన్నాయుడును తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 147,148,324,307,384,506, 341,120(b),109,188, రెడ్ విత్ 149, ఐపీసీ 123(1), ఆర్‌పీఏ 1951 కింద కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం, బెదిరింపులకు పాల్పడటం వంటి పలు సెక్షన్లపై అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. (అప్పన్న పోటీ.. అచ్చెన్న బెదిరింపులు)
దీంతో పాటు ఈ ఉదయం పోలీసులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును అదుపులోకి తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా నిమ్మాడలో ఎటువంటి సంఘటనలు తెలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అచ్చెన్నాయుడును కోటబొమ్మాళి పోలీసు స్టేషన్‌కి తరలించారు. విజయసాయిరెడ్డి పర్యటన నేపథ్యంలో నిమ్మాడలో భారీగా పోలీసులు మోహరించి భద్రత ఏర్పాటు చేశారు. నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కింజరాపు అప్పన్నపై ఇటీవల టీడీపీ నేతలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని విజయసాయిరెడ్డి పరామర్శించనున్నారు. అప్పన్నతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులకు భరోసా ఇచ్చేందుకు ఆయన నిమ్మాడలో పర్యటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment