కూటమి కక్ష.. ఎగుమతిదారులకు శిక్ష | Attempts by exporters to leave Kakinada | Sakshi
Sakshi News home page

కూటమి కక్ష.. ఎగుమతిదారులకు శిక్ష

Published Wed, Jul 3 2024 5:52 AM | Last Updated on Wed, Jul 3 2024 5:52 AM

Attempts by exporters to leave Kakinada

గోడౌన్ల సీజ్‌తో బియ్యం ఎగుమతులపై నీలినీడలు 

కాకినాడ పోర్టు ప్రతిష్టకూ దెబ్బ 

సీజ్‌ చేసిన బియ్యంలో బాయిల్డ్‌ రైస్, నూకలు 

రాష్ట్రంలో పీడీఎస్‌కు వినియోగించని బాయిల్డ్‌ రైస్‌ 

నూకలు ఉన్నా పీడీఎస్‌ బియ్యమేనా? 

మంత్రి నాదెండ్లకు వీటిపై అవగాహన లేదా? 

ప్రభుత్వ చర్యలను నిరసిస్తున్న ఎగుమతిదారులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 

కాకినాడ నుంచి వెళ్లిపోయేందుకు ఎగుమతిదారుల యత్నాలు 

కాండ్లా, పరదీప్‌ ఓడæరేవులపై దృష్టి

సాక్షి ప్రతినిధి, కాకినాడ: బియ్యం ఎగుమతిదారులపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. పీడీఎస్‌ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారన్న పేరుతో మొత్తం ఎగుమతులనే దెబ్బతీసే చర్యలకు దిగింది. ఈ ప్రభావం బియ్యం ఎగుమతిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న కాకినాడ పోర్టుపైనా పడింది. 

ఈ పోర్టుకు విదేశాల్లో ఉన్న విశ్వసనీయతను దెబ్బ తీస్తోంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెడ్ల మనోహర్‌ రెండు రోజులు కాకినాడలోనే తిష్ట వేసి గోడౌన్‌లపై దాడులు, పీడీఎస్‌ బియ్యం సీజ్‌ అంటూ ఎగుమతిదారులను భయపెట్టి, వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఎగుమతిదారులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు అంటున్నారు. 

బియ్యం ఎగుమతులపై మంత్రికి అవగాహన లేనందువల్లే వాటిని దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. గొడౌన్లపై దాడుల కారణంగా పోర్టులో ఎగుమతులపై నీలినీడలు కమ్ముకొన్నాయని చెబుతున్నారు. 

వాస్తవానికి మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతుండటంతో ముడి బియ్యం ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళ క్రితమే నిషేధించింది. ఎగుమతులను కఠినతరం చేసింది. అయితే ప్రత్యేక అనుమతులతో ప్రభుత్వ పర్యవేక్షణలో దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, సోమాలియా వంటి ఆఫ్రికా దేశాలకు మాత్రమే బియ్యం ఎగుమతి చేస్తున్నారు. 

సింగపూర్‌ కేంద్రంగా పనిచేసే ఓలం ఆగ్రోతోపాటు అంతర్జాతీయంగా మంచి పేరున్న లూయీస్‌ బ్రూఫిన్‌ వంటి దాదాపు 150 కంపెనీలు ది రైస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ సభ్యత్వంతో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నాయి. విశాఖ, కృష్ణపట్నం రేవులకంటే కాకినాడ రేవులో నిర్వహణపరంగా ఉన్న వెసులుబాటుతో 80 శాతం ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. 

గత ఐదేళ్లలో ఒక్క కాకినాడ నుంచే 1,47,55,837 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి అయింది. ఈ స్థాయిలో మరే పోర్టు నుంచి ఎగుమతి జరగలేదు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పోర్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేసే పరిస్థితి కలి్పంచవద్దని ఎగుమతిదారులు కోరుతున్నారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఎగుమతులపై లేని ప్రతిబంధకాలు ఇప్పుడే ఎందుకు ఎదురవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు.

అంతా పథకం ప్రకారమే.. 
సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి ఒక పథకం ప్రకారం కాకినాడ పోర్టు, ఇక్కడి బియ్యం లావాదేవీలు, తరతరాలుగా రైస్‌ మిల్లింగ్‌ రంగంలో ఉన్న కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబం లక్ష్యంగా టీడీపీ, జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ద్వారంపూడి కుటుంబం బియ్యం ఎగుమతులను శాసిస్తోందంటూ రాజకీయ లబ్థి కోసం ఆరోపణల­కు దిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాకినాడ పోర్టుపై కక్ష సాధింపు చర్యలకు దిగి, కోట్లు పెట్టుబడులు పెట్టిన ఎగుమతిదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. 

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకినాడ వచ్చి యాంకరేజ్‌ పోర్టు, డీప్‌వాటర్‌ పోర్టులలోని పలు గోడౌన్లను రెండు రోజులు తనిఖీ చేశారు. తొలి రోజు 7,615 మెట్రిక్‌ టన్నులు, రెండో రోజు అశోక గోడౌన్‌లో 2,800 మెట్రిక్‌ టన్నులు, హెచ్‌ఒన్‌ గోదాముల్లో 2,500 మెట్రిక్‌ టన్నులు బియ్యం, స్టాక్‌ రిజిస్టర్లను సీజ్‌ చేశామని మంత్రి నాదెండ్ల ప్రకటించారు. సింగపూర్‌కు చెందిన ఓలం, విశ్వప్రియ తదితర కంపెనీల గోడౌన్లలో సీజ్‌ చేసిన బియ్యంలో బాయిల్డ్‌ రైస్, బ్రోకెన్‌ రైస్‌ (నూకలు) ఉండటం గమనార్హం. ఇవన్నీ పీడీఎస్‌ బియ్యం అనే అనుమానంతో సీజ్‌ చేశారు. 

కానీ రాష్ట్రంలో ఎక్కడా బాయిల్డ్, నూకలను  పీడీఎస్‌కు వినియో­గించరు. అటువంటప్పుడు సీజ్‌ చేసిన బియ్యం పీడీఎస్‌ అని ఎలా నిర్ధారిస్తారని ఎగుమతిదారు­లు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్‌లో బియ్యం ధరకంటే నూకల ధర తక్కువ. అటువంటప్పుడు పీడీఎస్‌ బియ్యం నూకలుగా మార్చి ఎగుమతి చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందని, బియ్యంలో నూకలు ఉంటే అవి పీడీఎస్‌ అని ఎలా అంటున్నారని ఎగుమతిదారులు నిలదీస్తున్నారు.

కాకినాడ నుంచి తరలిపోనున్న ఎగుమతిదారులు!
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులతో ఎక్స్‌పోర్టర్లు ఇక్కడి రేవు ద్వారా ఎగుమతులకు స్వస్తి పలి­కేందుకు సిద్దమవుతున్నారు. కాకినాడ రేవును వది­లి కాండ్లా, పరదీప్‌ ఓడæరేవుల నుంచి ఎగుమతు­లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే జరిగితే పో­ర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ 10 వేల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. 

ఈ విషయమై కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని వివరణ కోరగా బియ్యం ఎగుమతులతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అయితే ఇక్కడి ఎగుమతిదారులను ఇబ్బందులకు గురి చేసేలా దాడులకు పాల్పడి ఈ ప్రాంత రేవు ప్రతిష్టను దెబ్బ తీయడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement