
సాక్షి, తాడేపల్లి: ఆస్ట్రేలియాకు చెందిన ఎంపీల వాణిజ్య ప్రతినిధుల బృందం ఒకటి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసింది. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా.. ఏపీలో వాణిజ్యంపై ఆసక్తికనబరుస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై ప్రశంసలు గుప్పించింది ఆ బృందం.
విక్టోరియా స్టేట్ చెందిన లేబర్ పార్టీ ఎంపీలు సీఎం జగన్‌ను కలిశారు. వీరిలో లేజిస్లేటివ్ కౌన్సిల్ ప్రభుత్వ విప్, లెజిస్టేటివ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కూడా ఉన్నారు. ఎనర్జీ, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలపై సీఎం జగన్ సర్కార్ చూపిస్తున్న చొరవను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించింది ఆస్ట్రేలియా ఎంపీల బృందం. శక్తి, విద్య, నైపుణ్యాల అభివృద్ధి రంగాలకు సంబంధించి వరుస చర్చలు జరగ్గా.. సీఎం జగన్‌తో భేటీపై సదరు ఎంపీల ప్రతినిధి బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. పవన, సౌర శక్తి రంగాల కింద ప్రభుత్వం కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉన్నాయని అక్కడి ప్రభుత్వ విప్, ఎంపీ అయిన లీ టర్మలీస్ పేర్కొన్నారు.
ఇక్కడ ఏపీలో పవన, సౌరశక్తి పరంగా ప్రభుత్వం చేపట్టిన ఆసక్తికరమైన కార్యక్రమాలు, అభివృద్ధి గురించి నేను వింటున్నాను. ఎనర్జీ, పునరుత్పాదకతపై చర్చించాం. విద్య విధానాల పరంగా.. నైపుణ్యాభివృద్ధి పరంగా మాకు, ఇక్కడి ప్రాంతానికి చాలా సారూప్యతలు ఉన్నాయి. ఒకే దృష్టి ఉంది కాబట్టి.. పరస్పర సహాయం అందించుకుంటాం అని ఎంపీ లీ టర్మలీస్ తెలిపారు.
ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రి తన సమయంతో చాలా ఉదారంగా ఉన్నారు. అందువల్లే మా సంభాషణ ఉదారంగా సాగింది. పాఠశాల కార్యక్రమాల కింద ప్రాథమిక మార్పులకు సంబంధించి మేము తీసుకువస్తున్న విధానాలు, మా లక్ష్యాలు ఒకే విధంగా ఉన్నాయి అని డిప్యూటీ స్పీకర్, ఎంపీ మాథ్యూ ఫ్రెగోన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment