బహుజన కులాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గురుప్రసాద్
సాక్షి, అమరావతి: ‘బహుజన హితాయా.. బహుజన సుఖాయా’ అని చాటిన బుద్ధుడి వ్యాఖ్యలను ఆచరణలో నిజం చేసి చూపిన సీఎం వైఎస్ జగన్.. సామాజిక న్యాయం చేసిన నేతగా సరికొత్త చరిత్ర సృష్టించారని బహుజన కులాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్ కితాబిచ్చారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు కేటాయించడంపై స్పందించిన ఆయన.. శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. బుద్ధిజం, అంబేడ్కరిజం, మహాత్మ జ్యోతిరావు పూలే కలలను సీఎం జగన్ సాకారం చేయడం గొప్ప విషయమన్నారు.
దేశంలో బహుజనుల కోసం ఏర్పడిన బీఎస్పీ సైతం రాజకీయ మనుగడ కోసం అగ్రవర్ణాలకు సీట్లిచ్చిందని, అగ్రవర్ణానికి చెందిన సీఎం జగన్ మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా దామాషా ప్రాతిపదికన నామినేటెడ్, మంత్రి పదవులు కేటాయించి యుగపురుషుడిగా నిలిచారని ప్రశంసించారు. టీడీపీ తన స్వార్థ రాజకీయాల కోసం వర్గీకరణ పేరుతో మాల, మాదిగలకు, రాజకీయ పదవుల పేరుతో గౌడ–శెట్టిబలిజలకు, రిజర్వేషన్ పేరుతో కాపులకు ఇతర కులాలతో తగవులు పెట్టిందని విమర్శించారు. సీఎం జగన్ మాత్రం కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వంటి అగ్రవర్ణాల్లోని పేదలకు మేలు చేసేలా ప్రత్యేక కార్పొరేషన్‌ల ద్వారా చర్యలు చేపట్టారని గురుప్రసాద్ గుర్తు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా బీసీ కులాల మేలు కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారన్నారు. కనీసం ఓటుకు, వార్డు మెంబర్‌కు కూడా అర్హతలేని సంచార జాతులకు ఏకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని, బహుజనులు ఎల్లప్పుడూ ఆయన వెంటనే ఉంటారని గురుప్రసాద్ స్పష్టం చేశారు.
ఇలాంటి సీఎంనే మేం కోరుకున్నాం..
ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య
రాష్ట్రంలో దళిత బహుజనులకు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘకాలం కొనసాగాలని, ఇలాంటి ముఖ్యమంత్రే తమకు కావాలని కోరుకున్నామని ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య చెప్పారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో అనేక రాష్ట్రాల్లో బీసీ, దళితులు ముఖ్యమంత్రులైనా.. సీఎం వైఎస్ జగన్ మాదిరిగా అణగారిన వర్గాలకు అగ్రపీఠం వేసిన వారు లేరన్నారు. దళితుల పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్‌లో సైతం అట్టడుగు వర్గాలకు అంతంత మాత్రంగానే ఉన్నత పదవులు దక్కాయని గుర్తుచేశారు.
బీసీల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్నత పదవులు ఇచ్చిన సందర్భాలు తక్కువేనని అన్నారు. దళిత బహుజనులకు చంద్రబాబు ఏనాడూ ప్రాధాన్యత శాఖలు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం తన వారితో త్యాగాలు చేయించి మరీ ఆయా పదవుల్లో ఎస్సీ, బీసీలను కూర్చోబెడుతుండటం ఆయన గొప్ప మనస్సుకు నిదర్శనమని చెంగయ్య కితాబిచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచిన అనంతరం సీఎం వైఎస్ జగన్ రెండు పర్యాయాలు ఎస్సీలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, రాష్ట్ర హోం మంత్రి పదవులివ్వడం ఆయనకే చెల్లిందన్నారు. సామాజిక విప్లవాన్ని సృష్టిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు దళితబహుజనులు అండగా ఉంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment